Share News

Dowry Vs Alimony: భరణం హక్కు.. వరకట్నం నేరం.. ఎందుకిలా? అసలు కారణం ఇదే!

ABN , Publish Date - Jul 09 , 2025 | 09:37 PM

ఇటీవల విడాకుల కేసులు ఎక్కువగా వస్తున్నాయి. విడాకుల తర్వాత భర్త తన భార్యకు కొంత భరణం తప్పక చెల్లించాలని ఒక చట్టం ఉంది. అయితే, దీనిపై ప్రస్తుతం చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వరకట్నం నేరం అయినప్పుడు.. భర్త తన భార్యకు భరణం ఎందుకు చెల్లించాలని వాదిస్తున్నారు. ఇంతకీ, అలిమోనీ అడగడం చట్టబద్ధమైనదా? కాదా? తెలుసుకుందాం..

Dowry Vs Alimony: భరణం హక్కు.. వరకట్నం నేరం.. ఎందుకిలా? అసలు కారణం ఇదే!
Alimony law in India

Alimony law in India: వరకట్నం ఇచ్చినా.. తీసుకున్నా నేరమని మన చట్టాలు చెబుతున్నాయి. అయినప్పటికీ, నేటికీ ఈ దురాచారం సదాచారంగా భేషుగ్గా కొనసాగుతూనే ఉంది. అయితే, ఇటీవల విడాకుల తీసుకునే దంపతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో, కోర్టు చెప్పిన ప్రకారం భార్యకు భరణం చెల్లించాల్సి వచ్చేందుకు కొందరు భర్తలు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరకట్నం నేరమైనప్పుడు.. భరణం తీసుకోవడం హక్కు ఎలా అవుతుందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాకెందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ, విడిపోయిన తర్వాత జీవనాధారం కోసం భార్యకు భర్త భరణం ఎందుకు చెల్లించాలి? భర్తకు భార్య ఎందుకు ఇవ్వకూడదు? దీని గురించి మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి.


వరకట్న నేరం:

భారతీయ చట్టం ప్రకారం వరకట్నం అడగడం, ఇవ్వడం రెండూ నేరమే. అయినా, ఈ దురాచారాన్ని వదులుకోలేకపోతున్నారు ప్రజలు. ఇప్పటికీ చాలా చోట్ల వరకట్న వేధింపుల కారణంగా మహిళలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. నిజానికి, 1961లో వరకట్న నిషేధ చట్టం అమలులోకి వచ్చింది. పేరుకే ఇంత కఠినమైన చట్టం. 6 దశాబ్దాలు గడిచినా వరకట్నం చెల్లించేందుకే తమ జీవితాలు ధారపోస్తున్నా తల్లిదండ్రులు దేశంలో నూటికి తొంభైమంది కనిపిస్తారు. అందుకే, ఇప్పటికీ పెళ్లి తర్వాత వరకట్న వేధింపులకు బలవుతున్నారు గృహిణులు. వివాహ సమయంలో ఇచ్చినా అదనపు కట్నం తేలేదనే సూటిపోటి మాటలు, వేధింపులు అత్తగారింట్లో భరిస్తూనే కాపురాలు చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఈ తంతు మాత్రం ఆగటం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం, 2024లో వరకట్న వేధింపుల కారణంగా 7045 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని సంవత్సరాల డేటాను పరిశీలిస్తే, 2017 నుండి 2021 వరకు, భారతదేశంలో మొత్తం 35,493 వరకట్న హత్య కేసులు నమోదయ్యాయి.

వరకట్నాన్ని అంతం చేయడానికి భారత ప్రభుత్వం వరకట్న నిషేధ చట్టం 1961 ను అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ఉద్దేశం శిక్షించడం కాదు, మహిళలకు గౌరవం, భద్రతకు చట్టపరమైన హక్కులను అందించడం. అదనంగా, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 304B ప్రకారం, ఒక మహిళ వివాహం అయిన 7 సంవత్సరాలలోపు మరణించి, ఆమె మరణానికి ముందు వరకట్నం కోసం హింసించబడిందని రుజువైతే దానిని వరకట్న హత్యగా పరిగణిస్తారు. అటువంటి సందర్భంలో, నిందితుడికి 7 సంవత్సరాల నుంచి జీవితకాలం వరకు జైలు శిక్ష విధించవచ్చు. అందువల్ల, వరకట్నం నేరం అయినప్పుడు పురుషుడు స్త్రీకి భరణం చెల్లించడం ఎంతవరకు సరైనదని చాలామంది వాదిస్తున్నారు?


భరణం అడగడం చట్టబద్ధమైనదేనా?

జీవిత భాగస్వామికి విడాకులు ఇచ్చిన తర్వాత పురుషుడు తన మాజీ భార్యకు భరణం చెల్లించాలి. దీని ఉద్దేశం ఆర్థిక సహాయం అందించడం. కొంతమంది మహిళలు వివాహం తర్వాత ఇంటి బాధ్యతల కోసం తమ ఉద్యోగాలను విడిచిపెట్టి భర్తలపై ఆధారపడవలసి వస్తుంది. అత్తగారు, మామగారు, భర్త, పిల్లలను చూసుకోవడానికి తమ కెరీర్ వదులుకుంటారు. అలాంటి సందర్భంలో ఏదైనా కారణం చేత విడాకులు తీసుకుంటే జీవిత భాగస్వామికి భరణం చెల్లించే చట్టం ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది.

భారతదేశంలోని చాలా మంది మహిళలు వివాహం తర్వాత పనికి వెళ్లరు. నిస్వార్థంగా ఇంటిని మేనేజ్ చేస్తారు. పిల్లలను పెంచడం, కుటుంబ శ్రేయస్సుకు తమదైన రీతిలో దోహదపడతారని భారతీయ చట్టం కూడా అంగీకరిస్తుంది. కానీ ఈ ఇంటి పనులు చేయడానికి వారికి డబ్బు లభించదు. మరోవైపు ఏదో ఒక కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడి వారు విడాకులు తీసుకున్నప్పుడు ఆ స్త్రీలకు ఒంటరిగా జీవించడానికి డబ్బు, ఉద్యోగం, పొదుపు ఉండదు. అందువల్ల, అటువంటి మహిళలు CrPC సెక్షన్ 125 మరియు గృహ హింస చట్టం 2005 ప్రకారం గృహనిర్మాణం, ఆహారం, ఇతర అవసరాలకు, వారి పిల్లల విద్య, సంరక్షణ కోసం అలిమొని తీసుకోవచ్చని భారతీయ చట్టాలు నిర్ధారించాయి. విడాకుల తర్వాత మహిళలు ఎవరి ముందు చేతులు చాచాల్సిన అవసరం లేకుండా ఈ చట్టం వారికి రక్షణ కల్పిస్తుంది.

భర్త నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తే, భార్య కూడా అంతే సంపాదిస్తే, ఆమె ఆర్థిక పరిస్థితి బాగుంటే, అప్పుడు భరణం చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, పిల్లల సంరక్షణ కోసం అటువంటి పరిస్థితిలో కూడా కోర్టు ఆర్థిక సహాయం ఆదేశించవచ్చు.


Also Read:

IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ... 17 రోజుల్లోనే 30 రామక్షేత్రాలు చూసే ఛాన్స్..

బస్సులో మీ లగేజీ మరిచిపోయారా.. టెన్షన్ పడకండి.. ఇలా చేస్తే చాలు..

For More Lifestyle News

Updated Date - Jul 09 , 2025 | 09:38 PM