Zimbabwe: పౌరులకు ఏనుగుల మాంసం పంపిణీ.. జింబాబ్వే నిర్ణయం
ABN , Publish Date - Jun 05 , 2025 | 10:11 PM
విపరీతంగా పెరిగిన ఏనుగుల సంతతిని తగ్గించేందుకు జింబాబ్వే కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని చంపి ఆ మాంసాన్ని ప్రజలకు పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏనుగుల సంతతి మితిమీరి పోవడంతో జింబాబ్వే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏనుగుల సంఖ్యను తగ్గించేలా కొన్నింటిని చంపి వాటి మాంసాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్కడి వన్యప్రాణి సంరక్షణ శాఖ తాజాగా తెలిపింది.
ప్రపంచంలో ఏనుగుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో మొదటి స్థానం బోత్స్వానా కాగా జింబాబ్వే రెండో స్థానంలో ఉంది. ఇక తొలి విడతలో భాగంగా 50 ఏనుగులను చంపనున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. అసలు టార్గెట్ ఏంతనేది మాత్రం వెల్లడించలేదు. 2024లో అక్కడ జరిగిన ఓ ఏరియల్ సర్వే ప్రకారం, సేవ్ వ్యాలీ కన్జర్వెన్సీలో సుమారు 2250 ఏనుగులు ఉన్నాయి. వాస్తవానికి ఆ ప్రాంతంలో 800 ఏనుగులకు సరిపడా వనరులు మాత్రమే ఉన్నాయి. గత ఐదేళ్లల్లో సుమారు 200 ఏనుగులను ఇతర వనారణ్యాలకు తరలించారు.
‘ఏనుగు దంతాలను మాత్రం ప్రభుత్వం తన వద్దే పెట్టుకుంది. మాంసాన్ని మాత్రం స్థానికంగా ఉన్న వారికి ఇస్తాం’ అని ఓ అధికారి తెలిపారు. జింబాబ్వే వద్ద ఇప్పటికే ఏనుగు దంతాలు భారీ సంఖ్యలో పోగుబడ్డాయి. అయితే, వీటి అమ్మకాలపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. కాగా, గతేడాది కూడా జింబాబ్వే 200 ఏనుగులను చంపేసింది. కరువుకాటకాలు వచ్చిపడటంతో వాటిని అంతమొందించక తప్పలేదు. ఏనుగుల సంఖ్యను తగ్గించేందుకు వాటిని ఇలా చంపడం 1988 తరువాత ఇదే తొలిసారి. ఈ చర్యలపై అనేక మంది విమర్శలు ఎక్కుపెడుతున్నారు. జింబాబ్వే పర్యాటకానికి ఏనుగులు ప్రధాన ఆకర్షణ. దీంతో, వాటిని అంతమొందించడం సబబు కాదని అంటున్నారు.
ఇవీ చదవండి:
ఖలిస్థానీ వేర్పాటు వాద పార్టీలతో సంబంధాలు తెంచుకోవాలి: కెనడా మాజీ ప్రధాని
పుతిన్ సాయం కోరిన పాక్.. మీ ఇన్‌ఫ్లుయెన్స్ వాడండని విజ్ఞప్తి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి