Share News

Worlds First Humanoid Robot: ఇనుములో క్రీడోత్సాహం పుట్టెనే

ABN , Publish Date - Aug 16 , 2025 | 03:01 AM

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చైనాలో మర మనుషుల హ్యూమనాయిడ్‌ రోబోలు ఆటల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి..

Worlds First Humanoid Robot: ఇనుములో క్రీడోత్సాహం పుట్టెనే

  • చైనాలో హ్యూమనాయిడ్‌ రోబోల ఆటల పోటీలు.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నిర్వహణ

  • పోటీల్లో పాల్గొంటున్న 16 దేశాల రోబోలు.. మొత్తం 280 జట్లు.. 26 అంశాల్లో పోటీలు

బీజింగ్‌, ఆగస్టు 15: ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చైనాలో మర మనుషుల(హ్యూమనాయిడ్‌ రోబోలు) ఆటల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ‘వరల్డ్‌ హ్యూమనాయిడ్‌ గేమ్స్‌’ జరగనున్నాయి. 16 దేశాలకు చెందిన 280 జట్లు మొత్తం 26 విభాగాల్లో పోటీ పడుతున్నాయి. మనుషులను పోలిన రోబోలను హ్యూమనాయిడ్‌ రోబోలు అంటారన్న సంగతి తెలిసిందే. మర మనుషుల క్రీడల్లో భాగంగా ఫుట్‌బాల్‌, రన్నింగ్‌, లాంగ్‌ జంప్‌, టేబుల్‌ టెన్నిస్‌ లాంటి ఆటలతో పాటు ఔషధాలను గుర్తించడం, వస్తువులను మోసుకువెళ్లడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం లాంటి అంశాల్లో కూడా పోటీలను నిర్వహిస్తున్నారు. అమెరికా, జపాన్‌ తదితర దేశాలకు చెందిన 192 యూనివర్సిటీలు, 88 ప్రైవేటు కంపెనీలు రూపొందించిన రోబోలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. రోబోల క్రీడల పోటీల్లో భాగంగా తొలుత స్ర్పింట్‌ రన్నింగ్‌, ఫుట్‌బాల్‌ పోటీలు జరిగాయి. చాలా రోబోలు ఆటల మధ్యలోనే పడిపోయాయి. అయితే, ఈ ఆటలు కేవలం వినోదానికే కాకుండా రోబోలపై పరిశోధనకు అత్యంత కీలకమని వివిధ రోబో కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ గేమ్స్‌లో ఒక్కో టికెట్‌ ధర రూ.1,500 నుంచి రూ.8వేల వరకు ఉంది. బీజింగ్‌ మున్సిపల్‌ గవర్నమెంట్‌ ఈ పోటీలను నిర్వహిస్తోంది. కాగా, చైనా కొంత కాలంగా ఏఐ, రోబోటిక్స్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది ఈ రంగం కోసం 20బిలియన్‌ డాలర్లను ఖర్చు పెట్టింది. ఏఐ, రోబోటిక్స్‌ స్టార్ట్‌పల కోసం భవిష్యత్తులో 137బిలియన్‌ డాలర్లతో ఓ నిధిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల బీజింగ్‌లో రోబో మారథాన్‌ నిర్వహించారు.

Updated Date - Aug 16 , 2025 | 03:01 AM