Zelensky : అమెరికా అండ లేకుంటే.. ఉక్రెయిన్ మనుగడ కష్టమే!
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:13 AM
..పిచుక మీద బ్రహ్మాస్త్రంలా తమ దేశం మీద దండయాత్రకు దిగిన అంత పెద్ద రష్యానూ మూడేళ్లుగా నిలువరించి వీరోచిత పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్‌స్కీ తాజాగా చేసిన వ్యాఖ్యలివి! అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారపగ్గాలు అందుకున్న ట్రంప్.. పుతిన్‌కు ఫోన్ చేసి గంటన్నర

ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్య
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు
మరో వారం రోజుల్లో మూడేళ్లు పూర్తి
18ు భూభాగం కోల్పోయిన ఉక్రెయిన్
రష్యా భూభాగంలో కొంత మేర ఆక్రమణ
అమెరికా, యూరప్ దేశాల మద్దతుతో
మూడేళ్లుగా రష్యా సేనలకు ముప్పుతిప్పలు
ట్రంప్ అధ్యక్షుడయ్యాక మారిన పరిస్థితి
‘సాయం’ అందించాలంటే ఉక్రెయిన్‌లోని
సగం ఖనిజ నిక్షేపాలు రాసివ్వాలని షరతు
ట్రంప్‌పై ఆశలు పెట్టుకోలేమన్న జెలెన్‌స్కీ
‘ఆర్మీ ఆఫ్ యూరప్’ ఏర్పాటుకు పిలుపు
‘‘అమెరికా అండ లేకపోతే.. రష్యా దాడులను ఎదుర్కొని ఉక్రెయిన్ మనుగడ సాగించే అవకాశాలు చాలా తక్కువ. బహుశా అది చాలా చాలా చాలా కష్టం’’
..పిచుక మీద బ్రహ్మాస్త్రంలా తమ దేశం మీద దండయాత్రకు దిగిన అంత పెద్ద రష్యానూ మూడేళ్లుగా నిలువరించి వీరోచిత పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్‌స్కీ తాజాగా చేసిన వ్యాఖ్యలివి! అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారపగ్గాలు అందుకున్న ట్రంప్.. పుతిన్‌కు ఫోన్ చేసి గంటన్నర సేపు మాట్లాడిన తర్వాత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్వరంలో కనిపించిన నిర్వేదం ఇది!! ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి వచ్చే సోమవారానికి (ఫిబ్రవరి 24) నిండా మూడు సంవత్సరాలు. 2022 ఫిబ్రవరి 24న రష్యా దండయాత్ర మొదలైన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ను రష్యా సులభంగా ఓడించేస్తుందని చాలా మంది భావించారు. కానీ.. అమెరికా, యూరప్ దేశాల సహకారంతో ఉక్రెయిన్ తన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఒక దశలో రష్యన్ యుద్ధట్యాంకులను, నల్ల సముద్రంలో రష్యా యుద్ధనౌకలను సైతం డ్రోన్లు, పాశ్చాత్య దేశాలు అందించిన క్షిపణుల సాయంతో నాశనం చేసి తీవ్ర నష్టం కలిగించింది. అంతేనా.. ఉక్రెయిన్ సైనికులు రష్యాకు చెందిన దాదాపు 1500 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని సైతం ఆక్రమించగలిగారు. కానీ అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని గణనీయంగా ఆక్రమించుకోగలిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్ తూర్పు భాగంలోని డోన్‌బా్‌స, కురఖోవ్‌ను ఆక్రమించి ఈశాన్యభాగంలోని పోక్రోవ్‌స్క్ దిశగా రష్యన్ సేనలు కదులుతున్నాయి. అటు దక్షిణాదిన ఇప్పటికే తమ భూభాగంలో విలీనం చేసుకున్నట్టుగా ప్రకటించిన ఖెర్సోన్, జాపొరిజియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాల్లో రష్యా మార్షల్ లా కూడా విధించింది. మొత్తమ్మీద ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా తొలి ఆరు నెలల్లో 1,19,000 చదరపు కిలోమీటర్ల మేర ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించిందని అంచనా. 2022కు ముందు ఆక్రమించుకున్న (క్రిమియా, డొనెట్స్క్, లుహాన్స్క్‌లోని కొన్ని ప్రాంతాలు) భూభాగం 42 వేల చదరపు కిలోమీటర్లను కూడా కలుపుకొంటే 1,61,000 చదరపు కిలోమీటర్లు అవుతుంది. ఇది ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు 27 శాతం. అయితే, ఆ తర్వాత వీరోచితంగా పోరాడిన ఉక్రెయిన్.. రష్యా ఆక్రమించుకున్న భూమిలో 74,443 చదరపు కిలోమీటర్ల మేర వెనక్కి తీసుకోగలిగింది. అయినప్పటికీ ఉక్రెయిన్ భూభాగంలో 18 శాతం ఇప్పటికీ రష్యా అధీనంలోనే ఉంది. అంతేకాదు.. కర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ ఆక్రమించిన తమ భూభాగంలో 40 శాతం దాకా తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. కానీ, ఈ క్రమంలో ఆరున్నర లక్షల మందికిపైగా రష్యన్ సైనికులు ఈ యుద్ధంలో చనిపోయారని ఉక్రెయిన్ చెబుతోంది. తనకున్న అపార వనరులు, ఆయుధ సంపత్తి దృష్ట్యా.. చిట్టెలుకలాంటి ఉక్రెయిన్‌పై గెలవడానికి రష్యా ఇంత ఆపసోపాలు పడుతోందంటే, పూర్తిగా గెలవలేకపోతోందంటే.. అమెరికా, యూరప్ దేశాల మద్దతే అందుకు కారణం. ఆయా దేశాలన్నీ కలిపి ఇప్పటిదాకా ఉక్రెయిన్‌కు ఆర్థికంగా, ఆయుధపరంగా అందించిన సాయం విలువ దాదాపు రూ.25 లక్షల కోట్లు. అందులో దాదాపు రూ.5.7 లక్షల కోట్ల సాయం అమెరికా నుంచే అందింది.
ట్రంప్ వచ్చాక మారిందేంటి?
ఇన్నాళ్లుగా యూరప్ దేశాలతోపాటు తమకు అండగా ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల్లో ఓటమిపాలు కావడం ఉక్రెయిన్‌కు పెద్ద దెబ్బే! ఎందుకంటే.. బైడెన్ హయాంలో ఉక్రెయిన్‌కు అమెరికా.. ఆర్థికంగా గానీ, ఆయుధాల రూపంలోగానీ అందించిన సాయం అపారం. శతఘ్నులు, రాకెట్ అమ్యూనిషన్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్స్, ఏరియల్ బాంబులను ఉక్రెయిన్‌కు అమెరికా పెద్ద ఎత్తున సరఫరా చేసింది. రెండు ఎఫ్-16 యుద్ధవిమానాలను సైతం గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్‌కు అమెరికా పంపించింది. ఇలా.. యుద్ధం మొదలైన 2022 ఫిబ్రవరి 24 నుంచి 2025 జనవరి 9 దాకా.. అమెరికా ఉక్రెయిన్‌కు అందించిన సాయం విలువ అక్షరాలా దాదాపుగా రూ.5.7 లక్షల కోట్లు. దిగిపోయే ముందు కూడా బైడెన్ ఉక్రెయిన్‌కు 500 మిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. ముందుగా చేసిన కేటాయింపుల ప్రకారం మరో 2.25 బిలియన్ డాలర్ల సాయం అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందాల్సి ఉంది. కానీ.. ట్రంప్ వచ్చాక పరిస్థితి మారింది. పుతిన్‌తో గంటన్నరసేపు మాట్లాడిన ట్రంప్.. నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చుకోవడం ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే పని కాదని, యుద్ధంలో పోగొట్టుకున్న భూభాగం మొత్తాన్నీ ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాలు లేవని వ్యాఖ్యానించారు. బైడెన్ హయాంలో అందించిన మద్దతును కొనసాగించాలంటే.. ఉక్రెయిన్‌లో ఉన్న అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాల్లో 500 బిలియన్ డాలర్ల విలువకు సమానమైన జిర్కోనియం, గాలియం వంటి ఖనిజాలను అమెరికాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ, జెలెన్‌స్కీ అందుకు ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ట్రంప్ గనక ఇదే ధోరణిలో వ్యవహరించి బైడెన్ తరహాలో సైనిక సాయాన్ని కొనసాగించకపోతే.. ఉక్రెయిన్ ఈ యుద్ధాన్ని నాలుగు నుంచి ఆరు వారాలకు మించి కొనసాగించలేకపోవచ్చని రక్షణ రంగ నిపుణుల అంచనా. అందుకే.. అమెరికా మద్దతు లేకుంటే ఉక్రెయిన్ మనుగడ కష్టమన్న వాస్తవాన్ని జెలెన్‌స్కీ బహిరంగంగా చెప్పారు!!
అమెరికాపై ఆశ లేదు!
డొనాల్డ్ ట్రంప్ హయాంలోని అమెరికాపై యూరప్ ఖండం ఇక ఆశలు పెట్టుకోకూడదని.. తనను తాను రక్షించుకోవడానికి యూరప్ దేశాలు ఇక సొంత సైన్యాన్ని (యూరోపియన్ ఆర్మీ) ఏర్పాటు చేసుకోవాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వ్యవహారంలో ట్రంప్ యూరప్ దేశాలకు ఒక్క మాట కూడా చెప్పకుండా కొద్దిరోజుల క్రితం పుతిన్‌కు ఫోన్ చేసి గంటన్నరసేపు మాట్లాడడం.. ఆ తర్వాత నుంచి ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడం వంటి పరిణామాల నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ పిలుపునిచ్చారు. ‘‘మనం నిజాయతీగా మాట్లాడుకుందాం. యూరప్ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించే అంశాల్లో సాయం చేయడానికి అమెరికా నో చెప్పవచ్చు. కాబట్టి, యూరప్ సాయుధ దళాల ఏర్పాటుకు ఇదే సరైన సమయమని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. ఉక్రెయిన్‌కు చోటు లేకుండా, తమ వెనకాల జరిగే ఒప్పందాలను తాము ఎన్నటికీ ఒప్పుకోబోమని ఆయన తేల్చిచెప్పారు. ‘‘ఉక్రెయిన్ లేకుండా ఉక్రెయిన్‌పై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేరు. యూరప్ (ప్రాతినిధ్యం) లేకుండా యూర్‌పపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేరు’’ అని స్పష్టం చేశారు. నిజానికి యూరప్ దేశాలు కూడా ట్రంప్ తీరుతో ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ నేతృత్వంలో పలు దేశాలు భేటీ అయి ఈ అంశంపై చర్చించాయి. త్వరలో సౌదీఅరేబియాలో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు ఏర్పాటు చేయనున్నట్టు ట్రంప్ యంత్రాంగంలోని సీనియర్ అధికారులు ప్రకటించడం... తమ ప్రమేయం ఏమీ లేకుండా శాంతి చర్చలు జరగడం యూరప్ దేశాలకు మింగుడుపడట్లేదు.
- సెంట్రల్ డెస్క్