Share News

China: చైనా నా మజాకా! వైరస్ మీద ఏనుగు దోమలతో ఆలౌట్ వార్

ABN , Publish Date - Aug 06 , 2025 | 03:05 PM

ఏమాటకామాటే చెప్పుకోవాలి చైనా అంటే, చైనానే. చైనా ఏ పని చేసినా ప్రపంచం అబ్బురపడి తీరాల్సిందే. అగ్రరాజ్యం అమెరికాను ఒంటి చేత్తో ఎదిరించినా, ట్రంప్ వెర్రి చేష్టలకు ధీటైన జవాబిచ్చినా చైనాకు చైనానే సాటి. ఇదంతా జియో పొలిటికల్ ఇష్యూస్ అయితే, ఇంట గెలిచి రచ్చగెలవడం చైనాకు పరిపాటి.

China: చైనా నా మజాకా! వైరస్ మీద ఏనుగు దోమలతో ఆలౌట్ వార్
China Wages All Out War

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏమాటకామాటే చెప్పుకోవాలి చైనా అంటే, చైనానే. చైనా ఏ పని చేసినా ప్రపంచం అబ్బురపడి తీరాల్సిందే. అగ్రరాజ్యం అమెరికాను ఒంటి చేత్తో ఎదిరించినా, ట్రంప్ వెర్రి చేష్టలకు ధీటైన జవాబిచ్చినా చైనాకు చైనానే సాటి. ఇదంతా జియో పొలిటికల్ ఇష్యూస్ అయితే, ఇంట గెలిచి రచ్చగెలవడం చైనాకు పరిపాటి.


తాజాగా చైనా దక్షిణ ప్రాంతంలోని గ్వాంగ్‌డాంగ్‌లో ప్రావిన్స్‌ ఫోషన్‌ నగరంలో చైనా సర్కారు ఇప్పుడు వైరస్‌పై యుద్ధం ప్రకటించింది. సైన్యాన్ని రంగంలోకి దింపి.. రక్షణచర్యలు షురూ చేసింది. వీధులను ఫాగింగ్‌తో పూర్తిగా డిస్‌ ఇన్‌ఫెక్ట్‌ చేస్తోంది. అంతేకాదు, దోమలు పెరిగే ప్రదేశాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఇక సైంటిస్టులు తమ వంతుగా భారీ ఎలిఫెంట్‌ దోమలను కూడా రంగంలోకి దింపారు. వీటితోపాటు, దోమలను తినే ప్రత్యేక రకమైన ఐదువేల చేపలను కాల్వల్లోకి వదిలారు.

ఇక మొదట, భారీ ఎలిఫెంట్ దోమలేంటో చూద్దాం.. వీటి అసలు పేరు 'టెక్సోరెంకైటిస్‌'. వీటిని 'ఎలిఫెంట్‌ మస్కిటో' అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దోమ జాతి ఇది. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో ఎక్కువగా ఇవి జీవిస్తుంటాయి. వీటిల్లో దాదాపు 90 రకాలు ఉన్నాయి. అడవుల్లో ఉండే ఈ భారీ దోమలు సైజులో 18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. ఎలిఫెంట్‌ మస్కిటోల గుడ్ల నుంచి కేవలం 40 నుంచి 60 గంటల్లోనే లార్వాలు బయటకు వస్తాయి. అవి సమీపంలోని సాధారణ దోమల గుడ్లు తిని పెరుగుతాయి. ఒక్క లార్వా కనీసం 100 దోమల గుడ్లను తింటుంది. దీంతో ఇతర దోమల సంతానం పెరగదు. అందుకే సదరు దోమల నివారణకు చైనా ఈ ఎలిఫెంట్ దోమల్ని రంగంలోకి దింపింది.


అయితే, ఈ ఎలిఫెంట్ దోమల్లో చాలా వాటివల్ల మనుషులకు ప్రమాదం లేదు. సాధారణంగా ఆడదోమలు మనుష్యుల రక్తాన్ని తాగుతాయి. కానీ చాలారకాల ఎలిఫెంట్‌ మస్కిటోలు ఆడవైనా సరే మొక్కలు, చెట్ల రసాలను పీల్చే బతుకుతాయి. వీటికి కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం అవసరం. రాత్రి వేళల్లో పడుకొంటాయి.


ఇక, చైనా ఇదంతా యుద్ధ ప్రాతిపదికన ఎందుకు చేస్తుందనే విషయానికొస్తే, చైనాలో నెల వ్యవధిలో 7,000 గన్యా కేసులు నమోదయ్యాయి. గత 20 ఏళ్లలో చైనాలో ఇంత తీవ్రస్థాయిలో ఈ వైరస్ సోకడం ఇదే తొలిసారి. 2008లో ఈ స్థాయిలో వైరస్‌ వ్యాపించింది. ఇందుకోసం ఇప్పుడు చైనా కొవిడ్‌ తరహాలో ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2,40,000 గన్యా కేసులు నమోదు కాగా.. వీటిల్లో 90 మరణాలు సంభవించినట్లు యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దక్షిణ అమెరికా దేశాల్లో అత్యధికంగా ఇది వ్యాపించింది. దీనిపై ఇప్పుడు దాయాది చైనా యుద్ధం ప్రకటించింది.

Updated Date - Aug 06 , 2025 | 03:41 PM