Toraja Tribe In Indonesia: శవాలతోటే జీవనం.. టోరజా జాతి గురించి తెలుసా?..
ABN , Publish Date - Oct 13 , 2025 | 03:51 PM
టోరజా జాతి వారు శవాలను మమ్మీలుగా మార్చి ఇంట్లోనే దాచుకుంటారు. వారు ఇంకా బతికే ఉన్నట్లు భావిస్తారు. శవాలతో అప్పుడప్పుడు మాట్లాడతారు. వారి కోసం కొంత ఆహారాన్ని పక్కకు తీసిపెడతారు.
‘స్వతంత్ర దేశంలో చావు కూడా పండగే బ్రదర్’ అని ఆకలి రాజ్యం సినిమాలో ఓ పాట ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో చావును కూడా ఓ పండుగలా సెలెబ్రేట్ చేస్తారు. అత్యంత ఘనంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని టోరజా జాతిలో కూడా ఇదే సంప్రదాయం ఉంది. చనిపోయిన వారి అంత్యక్రియలు అత్యంత ఘనంగా చేయటం అన్నది వందల ఏళ్లుగా వస్తోంది. అయితే, ఈ జాతి వారు చాలా పేద వారు.
అయినా కూడా అత్యంత ఘనంగా చనిపోయిన రక్త సంబంధీకుల అంత్యక్రియలు చేస్తారు. ఇందుకోసం లక్షల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అంత్యక్రియల కోసం తమ జీవిత కాలం దాచిన డబ్బుల్ని కూడా వాడతారు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోతే శవాలను మమ్మీలుగా మార్చి ఇంట్లోనే దాచుకుంటారు. వారు ఇంకా బతికే ఉన్నట్లు భావిస్తారు. శవాలతో అప్పుడప్పుడు మాట్లాడతారు. వారి కోసం కొంత ఆహారాన్ని పక్కకు తీసిపెడతారు. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి కొత్త బట్టలు వేస్తారు.
ఆ శవాలను తమ కొత్త తరాల వారికి పరిచయం చేస్తారు. కొన్నిసార్లు ఖర్చును తగ్గించుకోవడానికి కూడా చనిపోయిన వారిని మమ్మీలుగా మారుస్తుంటారు. ఇంట్లో వేరే వ్యక్తి చనిపోతే ఇద్దరికీ కలిపి ఒకేసారి అంత్యక్రియలు చేస్తారు. సాధారణంగా ఈ జాతిలో అంత్యక్రియలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. పెద్ద ఎత్తున అతిధుల్ని పిలుస్తారు. వారికి మాంసాహారం పెడతారు. చనిపోయిన వారి కోసం ఓ గుడిసె కట్టిస్తారు. అందులోనే అంత్యక్రియలు చేస్తారు.
ఇవి కూడా చదవండి
టోల్ గేట్లకు ఇక రాం రాం.. జియో పేమెంట్స్ బ్యాంక్‌తో అంతా కామ్!
షాకింగ్ యాక్సిడెంట్.. బైక్ కోసం ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..