Mao Ning: మేము చైనీయులం ఎవరికీ తలొగ్గం: మావో నింగ్
ABN , Publish Date - Apr 10 , 2025 | 08:34 PM
"మేం చైనీయులం, రెచ్చగొట్టే చర్యలకు భయపడం" అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తేల్చి చెప్పారు. అంతేకాదు, చైనా మాజీ నాయకుడు మావో జెడాంగ్ వీడియోను షేర్ చేసి తమ స్టాండ్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు.

China - America Trade War: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ దెబ్బకు కెనడా మినహా ప్రపంచదేశాలన్నీ కిక్కురుమనకుండా కూర్చొంటే, డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం అడుగడుగునా అమెరికాకు ఎదురు నిలబడుతోంది. నువ్వెంతంటే నువ్వెంత అనేలా ముందుకు సాగుతోంది. అమెరికా టారిఫ్స్ వేస్తే తాము కూడా దెబ్బకు దెబ్బ కొడతామనేలా సై అంటే సై అంటోంది. తాజాగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మరింత ముందుకెళ్లి "మేము చైనీయులం ఎవరికీ తలొగ్గం" అంటూ ప్రకటించింది.
మావో నింగ్ తన ఎక్స్ ఖాతాలో అమెరికాకి ధీటుగా ఒక పోస్ట్ పెట్టారు. ఇదిప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. చైనా, అమెరికా మధ్య సుంకాల యుద్ధం ఒక పక్క కొనసాగుతుంటే, మావో నింగ్ విప్లవాత్మక ప్రకటన చేశారు. "చైనా రెచ్చగొట్టే చర్యలకు భయపడదు.. అది వెనక్కి తగ్గదు" అని అన్నారు. అంతేకాదు, 1953లో అమెరికాతో యుద్ధంలో ఉన్న చైనా మాజీ నాయకుడు మావో జెడాంగ్ వీడియోను మావో నింగ్ షేర్ చేశారు.
మావో నింగ్ X లో పోస్ట్ చేసిన వీడియోలో, జెడాంగ్ ఇలా అన్నారు, "ఈ యుద్ధం ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇది ఒకప్పుడు అధ్యక్షుడు ట్రూమాన్ మీద ఆధారపడి ఉండేది. అదిప్పుడు అధ్యక్షుడు ఐసెన్ హోవర్ మీద ఆధారపడి ఉంది. తదుపరి అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే అది వారి ఇష్టం. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానితో సంబంధం లేకుండా, మేము ఎప్పటికీ లొంగం. మేము పూర్తిగా విజయం సాధించే వరకు పోరాడుతాము" అని జెడాంగ్ అన్నారు.
ఇలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం చైనాపై సుంకాలను తక్షణమే 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10 నుండి అమెరికా వస్తువులపై సుంకాన్ని 34 శాతం నుండి 84 శాతానికి పెంచిన చైనా ప్రతీకార చర్య తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ కొత్త టారిఫ్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..