US-Saudi Arabia: అమెరికా-సౌదీ మధ్య భారీ ఆయుధ ఒప్పందం
ABN , Publish Date - May 14 , 2025 | 05:55 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ అరేబియాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 142 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల సరఫరా ఒప్పందంపై సంతకాలు చేశారు. అలాగే, ఖతార్ ట్రంప్‌కు విలాసవంతమైన 747-8 జంబోజెట్ విమానాన్ని బహుమతిగా ఇచ్చింది.
రూ.12లక్షల కోట్ల విలువైన
ఆయుధాలు పంపిణీ చేయనున్న అమెరికా
రియాద్, మే 13: అమెరికా, సౌదీ అరేబియా మధ్య భారీగా ఆయుధాల సరఫరా ఒప్పందం జరిగింది. మధ్య ప్రాచ్యంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మంగళవారం సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ట్రంప్, సౌదీ రాజు ప్రిన్స్ సల్మాన్ సమక్షంలో ఇరు దేశాల అధికారులు పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశారు. సౌదీ అరేబియాకు దాదాపు 142 బిలియన్ డాలర్ల(రూ.12లక్షల కోట్లకు పైనే) విలువైన ఆయుధాల సరఫరాకు ఒప్పందం కుదిరిందని వౌట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలోని ఏఐ, ఇంధన మౌలిక వసతుల రంగంలో సౌదీ కంపెనీ ‘డేటా ఓల్ట్’.. 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నదని పేర్కొంది. గాజాలో యుద్ధం, ఇరాన్ అణ్వస్త్రాల తయారీతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ట్రంప్ తన పర్యటనలో ద్వైపాక్షిక బంధం బలోపేతం చేసుకోవడంతోపాటు సౌదీ అరేబియాకు భారీగా ఆయుధాలు సరఫరా చేసేందుకు అమెరికా ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మంగళవారం రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ట్రంప్‌కు సౌదీ రాజు ప్రిన్స్ స్వయంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం ఆల్ యమమాహ్ ప్యాలెస్ రాయల్ కోర్టులో ట్రంప్ బృందానికి విందునిచ్చారు. సౌదీ అరేబియాతోపాటు ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఐ) దేశాల్లోనూ ట్రంప్ పర్యటించనున్నారు.
ఫ్రీగా విమానం ఇస్తే.. వద్దనేందుకు మూర్ఖుడినా: ట్రంప్
అత్యంత ఖరీదైన, విలాసవంతమైన జంబోజెట్ విమానం ఉచితంగా ఇస్తే తిరస్కరించేందుకు నేనేమైనా పిచ్చోడినా? అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. త్వరలో మధ్య ప్రాచ్యంలో పర్యటించనున్న ట్రంప్ కోసం విలాసవంతమైన 747-8 జంబోజెట్ విమానాన్ని ఖతార్ రాజప్రాసాదం బహుమతిగా ఇచ్చింది. ట్రంప్ స్వీకరించారు కూడా. ఈ విమానానికి కొన్ని హంగులు అద్ది.. తాను 2029లో పదవీ విరమణ చేసేదాకా అధ్యక్ష విమానమైన ఎయిర్‌ఫోర్స్ వన్‌కు బదులుగా ఉపయోగించాలనే ప్రణాళికతో ట్రంప్ ఉన్నారు. దీనిపై డెమోక్రాట్లు విమర్శలు గుప్పించగా ట్రంప్ పై విధంగా స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..