US-China Trade War: సుంకాల యుద్ధం
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:18 AM
మెక్సికో, కెనడాలపై విధించిన 25% సుంకాల అమలు మంగళవారం నుంచే మొదలవుతుందని ట్రంప్ చేసిన ప్రకటనకు ఆయా దేశాలు అంతే ఘాటుగా స్పందించాయి. అమెరికా నుంచి తాము దిగుమతి చేసుకునే చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి వంటి ఉత్పత్తులపై అదనంగా 15ు సుంకాన్ని విధిస్తున్నట్టు చైనా ప్రకటించింది.

అమెరికా ఉత్పత్తులపై చైనా, కెనడా ప్రతీకార పన్నులు
ట్రంప్‌నకు తగిన సమాధానం చెప్పి తీరుతాం: ట్రూడో
సుంకాల వ్యవహారం ఒకరకంగా యుద్ధమే: వారెన్ బఫెట్
ఉక్రెయిన్‌కు సైనికసాయం నిలిపివేత
అమెరికా నిర్ణయం.. తక్షణం అమల్లోకి
రష్యాతో చర్చలకు సిద్ధపడితేనే నిర్ణయం వెనక్కి
అది కూడా ట్రంప్ నిర్ధారించిన తర్వాతే: వైట్‌హౌస్
ట్రంప్ నేతృత్వంలో నడుస్తాం.. ఖనిజాల ఒప్పందానికి సిద్ధం
తొలుత గగనతలంలో శాంతి.. ఎక్స్‌లో జెలెన్‌స్కీ ప్రకటన
వాషింగ్టన్, బీజింగ్, మార్చి 4: అమెరికా, చైనా, కెనడా, మెక్సికో నడుమ సుంకాలు, ప్రతిసుంకాల యుద్ధం జోరందుకుంది! చైనాపై ఇప్పటికే విధిస్తున్న 10 శాతం సుంకాన్ని రెట్టింపు చేయడంతోపాటు.. మెక్సికో, కెనడాలపై విధించిన 25ు సుంకాల అమలు మంగళవారం నుంచే మొదలవుతుందని ట్రంప్ చేసిన ప్రకటనకు ఆయా దేశాలు అంతే ఘాటుగా స్పందించాయి. అమెరికా నుంచి తాము దిగుమతి చేసుకునే చికెన్, గోధుమలు, మొక్కజొన్న, పత్తి వంటి ఉత్పత్తులపై అదనంగా 15ు సుంకాన్ని విధిస్తున్నట్టు చైనా ప్రకటించింది. అలాగే సోయాబీన్స్, పంది మాంసం, బీఫ్, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులపై 10ు అదనపు సుంకాన్ని వసూలు చేస్తామని పేర్కొంది. అంతేకాదు.. అమెరికాపై ప్రపంచవాణిజ్య సంస్థలో చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. తాము విధించిన అదనపు సుంకాలు మార్చి 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ తెలిపింది. ఈ చర్యలతోపాటు.. అమెరికాకు చెందిన 10 కంపెనీలను ‘విశ్వసనీయం కాని సంస్థల జాబితా’లో చేర్చాలని చైనా నిర్ణయించింది.
అమెరికాకు చెందిన రక్షణ, ఏఐ, వైమానిక, ఐటీ రంగాలకు చెందిన కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ చర్యలతోపాటు.. అమెరికాతో ఉక్రెయిన్‌కు, యూరప్ దేశాలకు మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో యూరోప్ దేశాలతోపాటు ఉక్రెయిన్‌తో సంబంధాలు పెంచుకునేందుకు చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు..
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. దీనికి తాము తగిన సమాధానం చెప్పి తీరుతామని హెచ్చరించారు. అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోకపోతేగనక.. ఆ దేశం నుంచి కెనడాకు దిగుమతయ్యే ఉత్పత్తులపై తొలి దశలో 25ు సుంకాలను విధిస్తామని, మంగళవారం అర్ధరాత్రి 12.01 గంటల నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. మరో మూడువారాల తర్వాత.. రెండో దశలో భాగంగా ఆటోమొబైల్, స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 25ు సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. అమెరికా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా ఈ సుంకాలను ఇలాగే కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. మరోవైపు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మాత్రం.. అమెరికా సుంకాలపై తాము ఆచితూచి వ్యవహరిస్తామని, దీనిపై తమ వద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బి, సి, డి కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ట్రంప్ తీరుపై అమెరికా స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ స్పందించారు. ప్రతీకార సుంకాలు విధించడాన్ని.. ఒకరకంగా యుద్ధంగానే (యాక్ట్ ఆఫ్ వార్) భావించవచ్చని పేర్కొన్నారు.
విద్యాసంస్థల్లో నిరసనలు చేస్తే నిధులు ఆపేస్తాం
అమెరికా విద్యాసంస్థల్లో నిరసనలపై నిషేధం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆజ్ఞలను ఉల్లంఘిస్తే నిధులు నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. ‘చట్ట వ్యతిరేక నిరసనలు, ఆందోళనలను పోత్సహించే విద్యాసంస్థలకు నిధులను నిలిపివేస్తాం. అంతేకాకుండా ఆందోళనకారులకు జైలుశిక్ష లేదా దేశ బహిష్కరణ తప్పదు.’ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమ వేదిక అయిన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.