Weapons Contract: పాక్‌కు అమెరికా క్షిపణులు
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:39 AM
అత్యాధునిక ఏఐఎమ్-120ల విక్రయానికి ఒప్పందం ఖరారు! క్షిపణుల అమరికకు వీలుగా ఎఫ్-16లను ఆధునీకరించనున్న అమెరికా బాలాకోట్‌పై దాడులకు ప్రతీకారంగా ఈ మిసైల్స్‌తోనే నాడు పాక్ ప్రతిదాడి ఇప్పుడు భారీగా సమకూర్చుకునే యత్నం..
వాషింగ్టన్, అక్టోబరు 8: అత్యాధునిక ఏఐఎమ్-120 క్షిపణులను పాకిస్థాన్‌కు అమెరికా అందించనున్నట్టు తెలిపింది. గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే మధ్యశ్రేణి క్షిపణులివి. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఈ ఏడాది మేలో యుద్ధ విరమణ తర్వాత అమెరికాకు దాయాది దేశం దగ్గరయిన నేపథ్యంలో భారీ ఆయుధ ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. ఇదే పని మీద గత జూలైలో పాకిస్థాన్ వాయుసేన చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా కుదిరిన ఆయుధ ఒప్పందాన్ని ధ్రువీకరిస్తూ అమెరికా రక్షణశాఖ నోటిఫికేషన్ జారీచేసినట్టు సమాచారం. ఆ నోటిఫికేషన్‌లో ఏఐఎమ్-120 కొనుగోలుదారుల జాబితాలో తక్కినదేశాలతోపాటు పాక్ పేరును కూడా అమెరికా చేర్చిందంటూ డాన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఏఐఎమ్-120లో సీ8, డీ అనే రెండు తరాల క్షిపణలున్నాయి. ఇందులో డీ తరహావి అమెరికా సైన్యం వినియోగిస్తోంది. వాటితో పోల్చితే సీ8 మరింత ఆధునికమైనది. వీటిని తయారుచేసే ఆయుధ సంస్థకు ఇప్పటికే 41.6 మిలియన్ల డాలర్ల విలువైన ఆర్డర్‌ను ఇచ్చినట్టు అమెరికా రక్షణ శాఖ ఈ ఏడాది సెప్టెంబరు 30న పత్రికలకు విడుదల చేసిన ప్రకటనను ఉటంకిస్తూ డాన్ పత్రిక తెలిపింది. మొత్తం కాంట్రాక్టు విలువ 2.51 బిలియన్ డాలర్లు. తయారీ పూర్తయి ఈ క్షిపణులు పాక్ సహా కొనుగోలుదేశాలకు 2030 మేకు గాని చేరవు. వాటిలో ఎన్ని పాక్‌కు అమెరికా ఇవ్వనున్నదనేది స్పష్టత లేదు.
అయితే, ఈ సందర్భంగా పాక్ వాయుసేనకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలను అమెరికా ఆధునీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, పాక్ వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో ఎఫ్-16లు మాత్రం ఏఐఎమ్-120 అమరికకు అనువైనవంటూ ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ డాన్ పత్రిక కథనం తెలిపింది. ఈ రకం క్షిపణులను కొన్నింటిని గతంలో పాక్ ఉపయోగించింది. బాలాకోట్‌లోని జైషే మహ్మద్ శిబిరాన్ని కూల్చివేసి, పెద్దఎత్తున ముష్కరులను భారత్ మట్టుబెట్టిన నేపథ్యంలో 2019లో ఈ క్షిపణులతోనే పాక్ ప్రతిదాడులకు దిగింది. ఇప్పుడు వాటిని పెద్ద ఎత్తునే దాయాది దేశం సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.