Share News

ట్రంప్‌ ‘బ్యూటీఫుల్‌ బిల్లు’కు సెనెట్‌ ఆమోదం

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:38 AM

అమెరికాలో ప్రభుత్వ వ్యయంలో కోత, వివిధ పన్నుల్లో భారీ స్థాయిలో మార్పులు తలపెడుతూ ట్రంప్‌ యంత్రాంగం రూపొందించిన ‘వన్‌ బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్‌ యాక్ట్‌’ను అక్కడి చట్టసభ సెనేట్‌ మంగళవారం ఆమోదించింది.

ట్రంప్‌ ‘బ్యూటీఫుల్‌ బిల్లు’కు సెనెట్‌ ఆమోదం

వాషింగ్టన్‌, జూలై 1: అమెరికాలో ప్రభుత్వ వ్యయంలో కోత, వివిధ పన్నుల్లో భారీ స్థాయిలో మార్పులు తలపెడుతూ ట్రంప్‌ యంత్రాంగం రూపొందించిన ‘వన్‌ బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్‌ యాక్ట్‌’ను అక్కడి చట్టసభ సెనేట్‌ మంగళవారం ఆమోదించింది. నాటకీయ పరిణామాల మధ్య ఈ బిల్లుకు ఆమోదం లభించింది. తొలుత సెనేట్‌లో దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా 50 చొప్పున ఓట్లు రావడంతో ఉత్కంఠ నెలకొంది. చివరికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఓటుతో ఆమోదం లభించడం గమనార్హం. నిజానికి ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) ఇప్పటికే ఆమోదించింది.


కానీ బిల్లులో సెనేట్‌ సభ్యులు మార్పులు చేసిన నేపథ్యంలో మళ్లీ ప్రతినిధుల సభ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రతినిధుల సభ ఆమోదిస్తే.. అధ్యక్షుడి సంతకంతో చట్టం అమల్లోకి వస్తుందని తెలిపాయి. 940 పేజీలతో కూడిన ‘బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్‌ చట్టం’లో ట్రంప్‌ యంత్రాంగం.. ఆహార సబ్సిడీలకు కోత, గ్రీన్‌ ఎనర్జీకి ప్రోత్సాహకాల రద్దు, వలసదారులను స్వదేశాలకు తిప్పిపంపేందుకు కఠిన చర్యలు, విద్యా రుణాల సాయంలో కోతలు, రక్షణ రంగ వ్యయం భారీగా పెంపు, ఆరోగ్య రంగానికి సబ్సిడీల కోత, ‘ట్రంప్‌ సేవింగ్స్‌’ ఖాతాలు, దిగుమతులపై ఆంక్షలు వంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే.. లక్షలాది మంది అమెరికన్లపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Jul 02 , 2025 | 05:38 AM