Share News

Israel: అణుబాంబు తయారీకి ఇరాన్‌కు మూడేళ్ల సమయం

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:13 AM

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధానికి దిగడానికి కారణమైన అణుబాంబు తయారీ’ వ్యవహారంపై అమెరికా ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక ఇచ్చింది.

Israel: అణుబాంబు తయారీకి  ఇరాన్‌కు మూడేళ్ల సమయం

అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదిక.. 3 నెలలే పడుతుందన్న ఇజ్రాయెల్‌

న్యూఢిల్లీ, జూన్‌ 17: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధానికి దిగడానికి కారణమైన ‘అణుబాంబు తయారీ’ వ్యవహారంపై అమెరికా ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక ఇచ్చింది. ఇరాన్‌ అణుబాంబు తయారు చేసేందుకు మూడేళ్ల సమయం పడుతుందని.. ఇజ్రాయెల్‌ చెబుతున్నట్టు మూడు మాసాలు కాదని స్పష్టం చేసింది. కానీ, ఇజ్రాయెల్‌ మాత్రం కొన్ని మాసాల వ్యవధిలోనే ఇరాన్‌ అణ్వాయుధాలను తయారు చేస్తుందని, దాని నుంచి రక్షణ కోసమే తాము యుద్ధానికి దిగామని పేర్కొంది. అయితే.. ఇంటెలిజెన్స్‌ మాత్రం అణ్వాయుధాల విషయంలో ఇరాన్‌ ఇప్పటి వరకు చురుగ్గా ఏమీలేదని తెలిపింది.


అణ్వాయుధాన్ని తయారు చేసేందుకు ఎంత లేదన్నా ఇరాన్‌కు మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఇరాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ జరుపుతున్న క్షిపణి దాడుల్లో కీలకమైన నటాంజ్‌ అణు కేంద్రం ధ్వంసమైనట్టు శాటిలైట్‌ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఇరాన్‌లోని అత్యంత కీలకమైన అణుకేంద్రం. అదేవిధంగా అణు పరీక్షల కేంద్రం ‘ఇస్ఫహాన్‌’పై కూడా ఇజ్రాయెల్‌ క్షిపణులు దాడులు చేశాయి. మరో ప్రధాన అణు కేంద్రం ఫోర్డోపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి దాడి జరగలేదు. అయితే, అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్‌ దీని జోలికి పోయే అవకాశం లేదని రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 04:13 AM