ప్రజా ప్రతిఘటన జోరు.. అమెరికాలో నిరసనల జోరు
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:11 AM
అమెరికా లాస్ ఏంజెల్స్‌లో అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారుల దాడులు, అరెస్టులకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్నాయి.
ట్రంప్ పుట్టిన రోజున నో కింగ్స్ డే పేరిట ప్రదర్శనలు
వాషింగ్టన్ డీసీ, జూన్ 14: అమెరికా లాస్ ఏంజెల్స్‌లో అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారుల దాడులు, అరెస్టులకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్నాయి. లాస్ ఏంజెల్స్‌తో మొదలైన నిరసనలు అమెరికా అంతటా విస్తరించాయి. అధ్యక్షుడు ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు శనివారం నో కింగ్స్ (రాజులు లేరు) డే పేరిట దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఫిలడెల్ఫియా, చికాగో, న్యూయార్క్, అట్లాంటా, అలాస్కా, ఫ్లోరిడా, టెక్సా్‌సతో పాటు రెండు వేల నగరాలు, పట్టణాల్లో శాంతియుతంగా నిరసనలు చేపట్టారు. కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజులు లేరు, సింహాసనాలు లేవు, కిరీటాల్లేవని రాసి ఉన్న ఫ్లెక్సీలు ప్రదర్శించారు.
శనివారం ట్రంప్ 79వ పుట్టిన రోజుతో పాటు అమెరికా మిలిటరీ 250వ వార్షికోత్సవం సందర్భంగా పరేడ్ కూడా నిర్వహిస్తుండటంతో ఆందోళనకారులు వాషింగ్టన్ డీసీ మినహా అన్ని చోట్లా నిరసనలు చేపట్టారు. అక్రమ వలసదారుల నిరసనలు పతాక స్థాయికి చేరుకోవడంతో అధ్యక్షుడు ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్లు సమాచారం. లాస్‌ఏంజెల్స్‌లో 4 వేల మంది నేషనల్ గార్డులను, 700 మంది మెరైన్‌లను మోహరించడం చెల్లదని, అధ్యక్షుడికి ఆ అధికారం లేదని ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశించడంతో ట్రంప్ దూకుడు తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అక్రమ వలసదారులు పెద్ద సంఖ్యలో పనిచేసే పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు, సోదాలు నిలిపివేయాలని ట్రంప్ ఆదేశించినట్లుగా అమెరికా మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి.