Share News

Balochistan Liberation Army: బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ఉగ్రవాద సంస్థ

ABN , Publish Date - Aug 12 , 2025 | 03:54 AM

పాక్‌ సర్కారుకు కంట్లో నలుసుగా మారిన‘బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ బీఎల్‌ఏని, దానికి చెందిన

Balochistan Liberation Army: బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ఉగ్రవాద సంస్థ

  • ప్రకటించిన అమెరికా ప్రభుత్వం

న్యూయార్క్‌, ఆగస్టు 11: పాక్‌ సర్కారుకు కంట్లో నలుసుగా మారిన‘బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ)’ని, దానికి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ను అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థల (ఎఫ్‌టీవో) జాబితాలో చేర్చింది. 2019 నుంచి ఆ రెండు సంస్థలూ పలు ఉగ్రదాడులు చేసిన నేపథ్యంలో.. వాటిని ఎఫ్‌టీవోలుగా గుర్తిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. బీఎల్‌ఏని 2019లోనే.. ‘స్పెషల్లీ డెజిగ్నేటెడ్‌ గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ (ఎస్‌డీజీటీ)’ జాబితాలో చేర్చిన అమెరికా.. తాజాగా మజీద్‌ బ్రిగేడ్‌ను కూడా బీఎల్‌ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. నిరుడు కరాచీ ఎయిర్‌పోర్టు సమీపంలో, గ్వదర్‌ పోర్ట్‌ అథారిటీ కాంప్లెక్స్‌ దగ్గర్లో జరిగిన ఆత్మాహుతి పేలుళ్లకు, 2025లో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జఫర్‌ ఎక్స్‌ప్రె్‌సను హైజాక్‌ చేసి 31 మంది పౌరులు/భద్రతాసిబ్బంది ప్రాణాలు తీసి 300 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్న ఘటనల వెనుక బీఎల్‌ఏనే ఉంది. అయితే.. అమెరికా ప్రకటన వెనుక కారణం ఇంకేదో ఉంటుందని విదేశీ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ‘‘పాకిస్థానే ఇండియాకు చమురు అమ్మవచ్చు’’ అని ట్రంప్‌ ఇటీవల ప్రకటించడం.. పాకిస్థాన్‌లో అత్యంత అరుదైన ఖనిజలోహాలు ఉన్నాయని చెప్పడం.. రెండ్రోజుల క్రితం అమెరికాకు వెళ్లిన పాక్‌ సైన్యాధిపతి అసీమ్‌ మునీర్‌ ఏమో.. ‘కలీమా ఆధారంగా ఏర్పడ్డ రాజ్యాలు రెండే. ఒకటి మదీనా (ఇప్పుడు సౌదీఅరేబియాలో అది ఒక నగరం). రెండోది పాకిస్తాన్‌. దేవుడు మదీనాను ఆశీర్వదించినట్లే పాక్‌ను కూడా ఆశీర్వదిస్తాడు’ అని వ్యాఖ్యానించడం చూస్తుంటే.. పాక్‌లో పెద్ద ఎత్తున అరుదైన మినరల్స్‌ లేదా చమురు నిక్షేపాలు దొరికాయా అనే అనుమానాలు కలుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

Updated Date - Aug 12 , 2025 | 03:54 AM