హైదరాబాద్ యువకుడికి అమెరికాలో 8 ఏళ్ల జైలు శిక్ష
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:27 AM
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌పై ట్రక్కుతో దాడికి యత్నించిన తెలుగు యువకుడు సాయి వర్షిత్ కందుల(20)కు అమెరికాలోని జిల్లా కోర్టు 8 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

2023లో ట్రక్కుతో వైట్‌హౌ్‌సపై దాడికి యత్నించిన సాయి వర్షిత్
అతనివి నాజీ సిద్ధాంతాలు: అమెరికా
వాషింగ్టన్, జనవరి 17: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌పై ట్రక్కుతో దాడికి యత్నించిన తెలుగు యువకుడు సాయి వర్షిత్ కందుల(20)కు అమెరికాలోని జిల్లా కోర్టు 8 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఆయన విడుదల అయిన తర్వాత కూడా మూడేళ్ల పాటు పర్యవేక్షణ కొనసాగుతుందని జడ్జి డాబ్నే ఎల్ ఫ్రెడ్‌రిచ్ తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని చందానగర్‌లో జన్మించిన సాయి వర్షిత్.. తర్వాత అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు పొందారు. అయితే, 2023, మే 22న ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని వైట్ హౌస్‌పై దాడికి యత్నించారు. తాజాగా ఈ కేసు విచారణ పూర్తయింది. ‘‘నియంత నాజీ సిద్ధాంతాలను ఒంటబట్టించుకున్న సాయి వర్షిత్.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అమెరికా ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేశారు’’ అని అమెరికా న్యాయ శాఖ నిప్పులు చెరిగింది. సాయి తన నేరాన్ని అంగీకరించినట్టు తెలిపింది. కోర్టుకు సమర్పించిన నివేదికల ప్రకారం.. 2023, మే 22న సాయి సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని శ్వేత సౌధం వైపు దూసుకువెళ్లారు. ఈ క్రమంలో వైట్ హౌస్ సహా ప్రెసిడెంట్ పార్క్‌కు రక్షణగా ఉన్న బారికేడ్లు ధ్వంసమయ్యాయి. అనంతరం ట్రక్కు నుంచి దిగిపోయిన సాయి.. దాని వెనుకకు వెళ్లి ట్రక్కుకు కట్టిన ‘నాజీ-స్వస్తిక్’ ముద్రలున్న తెల్లటి బ్యానర్లను తొలగించారు. ఈ సమయంలోనే పోలీసులు సాయిని అరెస్టు చేశారు. కాగా, డ్రగ్స్ కేసుల్లో దీర్ఘకాలంగా జైల్లో మగ్గుతున్న 2500 మందికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం క్షమాభిక్ష ప్రసాదించారు. తద్వారా అమెరికా అధ్యక్షులుగా చేసిన వారిలో ఇప్పటి వరకు ఎవరూ ప్రసాదించని క్షమాభిక్షలు, శిక్ష తగ్గింపులు చేసిన అధ్యక్షుడిగా బైడెన్ రికార్డు సృష్టించినట్టు అయింది.