Share News

Donald Trump: ట్రంప్‌ సుంకాలకు బ్రేక్‌..!

ABN , Publish Date - May 30 , 2025 | 05:42 AM

ట్రంప్‌కు అమెరికా వాణిజ్య కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాలను నిలుపుదల చేస్తూ మాన్‌హట్టన్‌లోని అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టు తీర్పు వెలువరించింది.

Donald Trump: ట్రంప్‌ సుంకాలకు బ్రేక్‌..!

  • ఆయన అధికారాలను అతిక్రమించారు

  • మనకు విక్రయించే వాటిపై సుంకాల మోత మోగించారు

  • అమెరికా వాణిజ్య కోర్టు.. సుంకాలను నిలిపివేస్తూ తీర్పు

  • సుంకాల వల్లే భారత్‌-పాక్‌ కాల్పుల విరమణ

  • చైనా కూడా దిగొచ్చే అవకాశముంది.. అధ్యక్షుడి వాదనలు

  • కొట్టేసిన కోర్టు.. న్యాయం గాడితప్పింది: ట్రంప్‌ సలహాదారు

  • ఆ చర్చ రాలే.. ట్రంప్‌ వాదనను వ్యతిరేకిస్తున్నాం: భారత్‌

వాషింగ్టన్‌, మే 29: ట్రంప్‌కు అమెరికా వాణిజ్య కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాలను నిలుపుదల చేస్తూ మాన్‌హట్టన్‌లోని అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టు తీర్పు వెలువరించింది. ఎడాపెడా దిగుమతి సుంకాలను విధించడం ద్వారా అధ్యక్షుడు తన అధికారాలను అతిక్రమించారని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. అమెరికా నుంచి ఇతర దేశాలు కొనుగోలు చేసే వాటికన్నా.. మనకు విక్రయించే వాటిపైనే సుంకాల మోత మోగించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) కింద సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి ఉందన్నారు. ఇది జాతీయ అత్యవసర సమయాల్లో అసాధారణ ముప్పును, హెచ్చరికలను నిలువరించేందుకు ఉద్దేశించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ సుంకాల విధానాన్ని సమర్థించాలని కోర్టును కోరారు. లేనిపక్షంలో చైనాతో వాణిజ్య సంధి దెబ్బతినడంతోపాటు, భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉన్న వివా దం తిరిగి రాజుకుంటుందని పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్‌ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పాక్‌కు చెందిన ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతరం అణ్వాయుధాలున్న రెండు దేశాలు ఘర్షణలకు దిగాయి. మే తొలివారంలో ట్రంప్‌ తన సుంకాల అధికారాన్ని వినియోగించి ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పించారు. ఇది అధ్యక్షుడికి ఉన్న సుంకాల అధికారంతోనే సాధ్యమైంది’’ అని అధికారులు సైతం వివరించారు. వాణిజ్య సుంకాలకు సంబంధించి పలు దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని, వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసేందుకు జూలై 7 వరకు గడువు ఉందన్నారు. ఈ నేపథ్యంలో దీన్ని సున్నితమైనదిగా పరిగణించాలని కోర్టును అభ్యర్థించారు.


అపరిమిత అధికారాల్లేవ్‌!

40.jpg

ఐఈఈపీఏ కింద అధ్యక్షుడికి కాంగ్రెస్‌ అపరిమిత అధికారాలను కట్టబెట్టలేదని వాణిజ్య కోర్టు స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అసాధారణ ముప్పును ఎదుర్కొనేందుకు ‘అవసరమైన’ ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘‘విదేశాలతో వాణిజ్య విధివిధానాలను నియంత్రించే అధికారం అమెరికా రాజ్యాంగం కాంగ్రె్‌సకు కట్టబెట్టింది. కాంగ్రె్‌సకు దఖలుపడిన ఈ అధికారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే పేరిట ‘అధ్యక్షుడి అత్యవసర అధికారం’ తోసిపుచ్చజాలదు. అలా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమే’’ అని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తీర్పు వచ్చిన వెంటనే ట్రంప్‌ ప్రభుత్వం అప్పీల్‌ దాఖలు చేసింది. కాగా, కోర్టు తీర్పుపై ట్రంప్‌ కార్యాలయం మౌనం వహించగా ఆయన సలహాదారు స్టీపెన్‌ మిల్లర్‌ మాత్రం తీవ్రంగా స్పందించారు. ‘‘న్యాయ వ్యవస్థ గాడి తప్పింది’’ అని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు.. వీసాల నిషేధానికి సంబంధించి అమెరికా ప్రభుత్వం నూతన నిబంధన తీసుకొచ్చింది. అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమాల్లో ఆ దేశ పౌరులు చేసే వ్యాఖ్యలపై ఏ ఇతర దేశ అధికారులైనా చర్యలు తీసుకుంటే.. అలాంటి వారికి వీసాలు ఇవ్వబోమని తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మారో రుబియో ప్రకటించారు.

‘‘విదేశాలతో వాణిజ్య విధివిధానాలను నియంత్రించే అధికారం అమెరికా రాజ్యాంగం కాంగ్రె్‌సకు కట్టబెట్టింది. కాంగ్రె్‌సకు దఖలుపడిన ఈ అధికారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే పేరిట ‘అధ్యక్షుడి అత్యవసర అధికారం’ తోసిపుచ్చజాలదు. అలా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమే.’’

- అంతర్జాతీయ వాణిజ్య కోర్టు


చర్చల్లో సుంకాల ప్రస్థావన లేదు

  • ట్రంప్‌ వాదనను వ్యతిరేకిస్తున్నాం: భారత్‌

సుంకాలు విధిస్తామని హెచ్చరించినందునే భారత్‌-పాకిస్థాన్‌లు కాల్పల విరమణకు ఒప్పుకొన్నాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాదనలను భారత్‌ తోసిపుచ్చింది. అసలు ఆనాటి చర్చల్లో సుంకాల ప్రస్థావన రాలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘‘మే నెల ప్రారంభంలో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో సుంకాల అంశం అసలు లేనేలేదు.’’ అని తేల్చి చెప్పింది. ‘‘ఈ ప్రత్యేక అంశాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మే 7న ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించి.. 10వ తేదీన కాల్పుల విరమణకు ఒప్పుకొనే వరకు భారత్‌-అమెరికాల మధ్య పలు మార్లు చర్చలు జరిగాయి. అయితే ఏ సందర్భంలోనూ ఈ సుంకాల వ్యవహారం మా మధ్యరాలేదు.’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ చెప్పారు.

Updated Date - May 30 , 2025 | 06:09 AM