Share News

Ukraine: రష్యాపై ఉక్రెయిన్‌ భీకర డ్రోన్‌ దాడులు

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:33 AM

తమ రాజధాని మాస్కో సహా దేశంలోని పది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ అతి భారీ స్థాయిలో డ్రోన్‌ దాడులకు తెగబడిందని రష్యా సైన్యం మంగళవారం ప్రకటించింది.

Ukraine: రష్యాపై ఉక్రెయిన్‌ భీకర డ్రోన్‌ దాడులు

మాస్కో సహా పది ప్రాంతాలే లక్ష్యం.. శాంతి చర్చల వేళ అనూహ్య చర్య

  • 337 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చివేశాం

  • దాడుల్లో ఇద్దరి మృతి.. రష్యా ప్రకటన

మాస్కో, మార్చి 11: తమ రాజధాని మాస్కో సహా దేశంలోని పది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్‌ అతి భారీ స్థాయిలో డ్రోన్‌ దాడులకు తెగబడిందని రష్యా సైన్యం మంగళవారం ప్రకటించింది. ఈ దాడుల్లో ఇద్దరు చనిపోయారని, 18 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఉక్రెయిన్‌కు చెందిన 337 డ్రోన్లను కూల్చివే శామని వివరించింది. ఒక్క మాస్కో వైపే ఉక్రెయిన్‌ 91 డ్రోన్లను ప్రయోగించిందని పేర్కొంది. రష్యా దేశ భూభాగంలోపల, సరిహద్దులకు బాగా దూరంగా ఉన్న ప్రాంతాలు కలుగా, లిపెస్క్‌, ఓర్యోల్‌, ర్యాజాన్‌ ప్రాంతాలపై కూడా ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులకు దిగడం, అది కూడా యుద్ధం ముగింపుపై చర్చలు ప్రారంభమైన వేళ ఈ చర్యకు పూనుకోవడం ప్రాధాన్యం సంతరించుకొంది.


మూడేళ్ల రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఉక్రెయిన్‌ ఇంతకుముందెన్నడూ రష్యాపై ఈ స్థాయిలో డ్రోన్‌ దాడులు చేయలేదు. మరోవైపు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపుపై చర్చల కోసం అమెరికా, ఉక్రెయిన్‌ ప్రతినిధి బృందాలు మంగళవారం సౌదీ అరేబియాలోని జెద్దా నగరానికి చేరుకున్నాయి. రెండు బృందాల మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. అమెరికా ప్రతినిధుల బృందంలో ఆ దేశ విదేశాంగ మంత్రి రుబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్ట్జ్‌ ఉన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా జెద్దా చేరుకున్నారు. శాంతి చర్చల కోసం తాము ఉక్రెయిన్‌కు ఎలాంటి కండిషన్లు పెట్టలేదని రుబియో చెప్పారు.

Updated Date - Mar 12 , 2025 | 05:33 AM