Ukraine war: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరపున చైనీయులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:51 AM
రష్యా ఆక్రమిత డోనెట్స్క్‌లో ఇద్దరు చైనీయులను బంధించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. తమపై యుద్ధంలో చైనా పాలుపంచుకుందన్న ఆరోపణలను బీజింగ్ ఖండించింది.

మాస్కో, కీవ్, ఏప్రిల్ 9: తమతో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున చైనీయులు పాల్గొన్నారని ఉక్రెయిన్ ఆరోపించింది. తమ బలగాలు ఇద్దరు చైనీయులను రష్యా ఆక్రమిత డోనెట్స్క్ ప్రాంతంలో బంధించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. మొత్తం ఆరుగురు చైనీయులతో పోరాడి ఇద్దరిని బందీలుగా పట్టుకున్నారని ఆయన తెలిపారు. తమపై యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనసాగించాలనుకుంటున్నారనే విషయాన్ని ఇది స్పష్టం చేస్తుందని జెలెన్‌స్కీ చెప్పారు. రష్యా తరపున మరింతమంది చైనీయులు యుద్ధంలో పాల్గొంటున్నారని తాము అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్ ఆరోపణలను చైనా కొట్టిపారేసింది. రాజకీయపరంగా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తాము చేసిన, చేస్తున్న యత్నాలను ఉక్రెయిన్ పరిశీలించాలని కోరింది.