Share News

Water Conservation: పాత ఈ-మెయిల్స్‌ డిలీట్‌ చేసి నీటిని పొదుపు చెయ్యండి

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:23 AM

పాత ఈ-మెయిల్‌లు, ఫొటోలు డిలీట్‌ చేసి నీటిని పొదుపు చెయ్యండి.. బ్రిటన్‌ పౌరులకు ఆ దేశ అధికారులు ఇచ్చిన పిలుపు ఇది.

Water Conservation: పాత ఈ-మెయిల్స్‌ డిలీట్‌ చేసి నీటిని పొదుపు చెయ్యండి

  • కరువు నేపథ్యంలో యూకే ప్రజలకు అధికారుల పిలుపు

బ్రిటన్‌, ఆగస్టు 13 : పాత ఈ-మెయిల్‌లు, ఫొటోలు డిలీట్‌ చేసి నీటిని పొదుపు చెయ్యండి.. బ్రిటన్‌ పౌరులకు ఆ దేశ అధికారులు ఇచ్చిన పిలుపు ఇది. ఈ-మెయిల్‌లు, ఫొటోలకు నీళ్లకు ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారా ?. సాధారణంగా ఈ-మెయిల్‌లు, ఫొటోలు, వీడియోలన్నీ ఉండే క్లౌడ్‌ స్టోరేజీలను పెద్ద పెద్ద డేటా సెంటర్లు నిర్వహిస్తుంటాయి. పెద్ద ఎత్తున విద్యుత్‌ను వినియోగించుకునే ఈ డేటా సెంటర్లలోని పరికరాలు వెలువరిచే ఉష్ణోగ్రతను నియంత్రించి వాటిని చల్లబరిచేందుకు భారీ ఎత్తున నీటి వనరులు అవసరం అవుతాయి.


అయితే, నీటి కొరతతో ఇప్పటికే తీవ్రమైన కరువు ఎదుర్కొంటున్న బ్రిటన్‌.. నీటి నిల్వల పొదుపుపై దృష్టి సారించింది. బ్రిటన్‌ పర్యావరణ విభాగం సూచనల మేరకు డేటా సెంటర్లలో నీటి వినియోగంపై దృష్టి పెట్టింది. డేటా సెంటర్లపై ఒత్తిడి తగ్గిస్తే పెద్ద ఎత్తున నీటి నిల్వలు మిగులుతాయనే ఆలోచనతో.. క్లౌడ్‌లో ఉన్న పాత ఈ-మెయిల్‌లు, ఫొటోలను డిలీట్‌ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఇదేకాక, నీటి పొదుపు కోసం స్నానం చేసే సమయాన్ని తగ్గించుకోవడం వంటి మరిన్ని సూచనలు కూడా చేసింది.

Updated Date - Aug 14 , 2025 | 06:52 AM