Russia Ukraine: కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సై
ABN , Publish Date - Mar 13 , 2025 | 06:01 AM
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. సౌదీ అరేబియాలో అమెరికా-ఉక్రెయిన్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి.

సౌదీలో ఫలించిన అమెరికా చర్చలు
ఉక్రెయిన్‌కు సైనిక సాయం పునరుద్ధరణ
ఇక మిగిలింది పుతిన్ అంగీకారమే..
వైట్‌హౌ్‌సలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికా మద్యంపై భారత్ 150% పన్ను
వ్యవసాయ ఉత్పత్తుల మీద 100%
అందుకే ఆ దేశంపై ప్రతీకార సుంకాలు
వైట్‌హౌస్ ప్రతినిధి వెల్లడి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. సౌదీ అరేబియాలో అమెరికా-ఉక్రెయిన్ మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ చర్చల్లో భాగంగా 30 రోజుల పాటు కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. దీంతో.. ఉక్రెయిన్‌పై విధించిన ఆంక్షలను ఉపసంహరించినట్లు ట్రంప్ ప్రకటించారు. మునుపటిలాగానే ఉక్రెయిన్‌కు మిలటరీ సాయం.. ఇంటెలిజెన్స్ సహకారం అందజేస్తామని వివరించారు. ‘‘కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. రష్యా స్పందనే మిగిలి ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మా ప్రతిపాదనకు అంగీకరిస్తారని మేము ఆశిస్తున్నాం.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మరోమారు చర్చలు జరుపుతాం. ఆయనను వైట్‌హౌ్‌సకు ఆహ్వానిస్తాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాల్పుల విరమణకు మూడు షరతులను విధించే అవకాశాలున్నాయని బ్లూంబెర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో ప్రధానంగా ఉక్రెయిన్ ఇకపై నాటో సభ్యత్వ ఆశలను వదులు కోవాలని డిమాండ్ చేయనుందని పేర్కొంది. దీంతోపాటు.. తాము ఆక్రమించిన భూభాగాలను ఉక్రెయిన్ గుర్తించాలని, తటస్థతను పాటించాలని షరతులను విధించనున్నట్లు తన కథనంలో పేర్కొంది.