Share News

Trump: రూ.348.75 లక్షల కోట్లు ఉఫ్‌

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:30 AM

రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే ట్రంప్‌ మొదలుపెట్టిన సుంకాల యుద్ధం అమెరికాకే గుదిబండగా మారుతోంది. చైనా, భారత్‌, కెనడా, మెక్సికో, యూరప్‌ దేశాల మీద.. పరస్పర పన్నుల పేరిట ట్రంప్‌ కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే.

Trump: రూ.348.75 లక్షల కోట్లు ఉఫ్‌

  • 20 రోజుల్లో అమెరికా స్టాక్‌మార్కెట్లు మూటగట్టుకున్న నష్టం

  • మన దేశ బడ్జెట్‌కు ఇది ఏడింతలు

  • ట్రంప్‌ భస్మాసురహస్తం ఫలితం

  • సుంకాల యుద్ధం, యథేచ్ఛగా ఉద్యోగుల తొలగింపుతో అమెరికాలో ఆర్థిక అనిశ్చితి

  • పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో కార్పొరేట్‌ కంపెనీలు

(సెంట్రల్‌ డెస్క్‌)

రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే ట్రంప్‌ మొదలుపెట్టిన సుంకాల యుద్ధం అమెరికాకే గుదిబండగా మారుతోంది. చైనా, భారత్‌, కెనడా, మెక్సికో, యూరప్‌ దేశాల మీద.. పరస్పర పన్నుల పేరిట ట్రంప్‌ కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని దశాబ్దాలుగా అమలైన ప్రపంచీకరణ విధానాలతో యావత్‌ ప్రపంచం ఓ కుగ్రామంలా తయారైంది. ఇటువంటప్పుడు, ట్రంప్‌ కొత్తగా.. ‘మాకు మేమే.. మీకు మీరే’ అంటూ తెచ్చిన సుంకాలతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. స్వయంగా అమెరికా కూడా దీన్ని తప్పించుకోలేకపోతోంది. తీవ్ర అనిశ్చితి, ఆందోళన నేపథ్యంలో భారీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా స్టాక్‌మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో గత 20 రోజుల వ్యవధిలో ఆ దేశ స్టాక్‌మార్కెట్లలో నమోదైన టాప్‌-500 కంపెనీలు (వీటిని స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ 500 లేదా ఎస్‌ అండ్‌ పీ 500 అని అంటారు) ఏకంగా 4 లక్షల కోట్ల డాలర్ల (రూ.348.75 లక్షల కోట్ల) నష్టాన్ని చవి చూశాయి. మన దేశ బడ్జెట్‌ (రూ.50.65 లక్షల కోట్లు)తో పోల్చుకుంటే ఇది దాదాపు ఏడింతలు.

39.jpg


కొత్తలో మార్కెట్ల జోరు

వాస్తవానికి, గత ఏడాది నవంబరు 5వ తేదీన ట్రంప్‌ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికా స్టాక్‌మార్కెట్లు జోరు చూపాయి. పన్ను తగ్గింపులు, నియంత్రణల తొలగింపు వంటి విధానాలను ట్రంప్‌ తీసుకొస్తారని మార్కెట్‌ వర్గాలు ఆశించాయి. ఫలితంగా, స్టాక్‌మార్కెట్లు మంచి వృద్ధి రేటును నమోదు చేశాయి. గత నెల 19న ఎస్‌ అండ్‌ పీ 500 రికార్డు స్థాయిలో ముగిసింది. అయితే, ట్రంప్‌ పలు దేశాలతో సుంకాల యుద్ధం మొదలుపెట్టటం, స్వదేశంలో ప్రభుత్వ ఉద్యోగులను యథేచ్ఛగా ఉద్యోగాల్లోంచి తొలగించటం వంటి విధానాలను తెస్తున్న క్రమంలో స్టాక్‌మార్కెట్ల జోరు తగ్గిపోవటమే కాదు.. బతుకుజీవుడా అనే స్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఒక్కరోజే ఎస్‌ అండ్‌ పీ 500.. 2.7ు మేర పతనమై 8.6ు వద్ద ముగిసింది. గత ఏడాది కాలంలో ఇదే అతి పెద్ద రోజువారీ పతనం. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి సోమవారం వరకు 20 రోజుల్లో ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌లో దాదాపు 10 శాతం పతనం నమోదైంది. ఫలితంగా కంపెనీలు 4 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయాయని వెల్లడైంది. అమెరికా స్టాక్‌మార్కెట్లలో అతి ముఖ్యమైన నాస్డాక్‌ కూడా సోమవారం 4ు పడిపోయింది. 2022 సెప్టెంబరు నుంచి.. ఒక్కరోజులో నాస్డాక్‌ ఈ స్థాయిలో పతనం కావటం ఇదే తొలిసారి.


తీవ్ర గందరగోళం

‘కెనడా, మెక్సికో, యూర్‌పతో మొదలుపెట్టిన సుంకాల యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితి.. అనేక కార్పొరేట్‌ సంస్థలను, సీఈఓలను భవిష్యత్‌ ప్రణాళికలు సమీక్షించుకునేలా చేస్తోంది’ అని హ్యూస్టన్‌లో జరిగిన ఓ వాణిజ్య సదస్సులో లాజార్డ్‌ సీఈఓ పీటర్‌ ఆర్స్‌జగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. లాజార్డ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఇండిపెండెంట్‌ ఇన్‌వె్‌స్టమెంట్‌ బ్యాంకు. చైనాతో సై అంటే సై అనే విధానాన్ని అర్థం చేసుకోవచ్చుగానీ.. కెనడా, మెక్సికో, యూర్‌పతో ట్రంప్‌ ఎందుకు దుందుడుకు విధానాల్ని అవలంభిస్తున్నారనే దానిపై గందరగోళం నెలకొందని పీటర్‌ పేర్కొన్నారు. దీనిపై రానున్న నెల రోజుల్లోపు స్పష్టత రాకపోతే అమెరికా ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతినబోతోందని ఆయన హెచ్చరించారు. అమెరికాలోని ప్రముఖ వైమానిక సేవా సంస్థల్లో ఒకటైన డెల్టా ఎయిర్‌లైన్స్‌.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక అంచనా లాభాలను సోమవారం సగానికి తగ్గించుకుంది. ఫలితంగా ఆ కంపెనీ షేర్ల ధర ఒక్కరోజులోనే 14 శాతం పడిపోయింది. ట్రంప్‌ 2.0 కేవలం నెలన్నర రోజుల్లో సృష్టించిన ప్రకంపనలు అమెరికా కార్పొరేట్‌ రంగాన్ని వణికిస్తున్నాయి. స్వయంగా వ్యాపారవేత్త అయిన ట్రంప్‌ విధానాలు వ్యాపారుల ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చకపోగా.. పూర్తి విరుద్ధంగా ఉండటం విచిత్రం.


సుంకాల తగ్గింపుపై అమెరికాకు హామీ ఇవ్వలేదు పార్లమెంటరీ కమిటీకి వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 11: సుంకాల తగ్గింపు అంశంపై అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే లేవనెత్తుతున్న ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబరు వరకూ సమయం కోరినట్లు పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించింది. తక్షణం సుంకాల సర్దుబాటు కంటే దీర్ఘకాలిక సహకారానికి ప్రాధాన్యం ఇస్తూ పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనే దిశగా భారత్‌, అమెరికా కృషి చేస్తున్నాయని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ముందు మంగళవారం హాజరైన వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బర్త్వాల్‌ వివరించారు. కాగా, అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాల తగ్గింపునకు భారత్‌ అంగీకరించిందని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. అమెరికాపై భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోందని, అవి ఆ దేశంలో ఏ వస్తువూ విక్రయించడానికి వీల్లేనంత స్థాయిలో ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 05:30 AM