Share News

Donald Trump: యుద్ధం ఆపకుంటే.. తీవ్ర పరిణామాలు తప్పవు

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:19 AM

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

Donald Trump: యుద్ధం ఆపకుంటే.. తీవ్ర పరిణామాలు తప్పవు

  • రష్యాకు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌, ఆగస్టు 13: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌ యుద్ధం, పుతిన్‌తో శుక్రవారం జరగనున్న భేటీ నేపథ్యంలో.. బుధవారం యూరోపియన్‌ దేశాల నేతలు, జెలెన్‌స్కీతో ట్రంప్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పుతిన్‌తో మీ భేటీ తర్వాత కూడా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు అంగీకరించకపోతే రష్యాపై ఏమైనా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించగా.. ‘‘అవును. ఈ విషయం నేను చెప్పకూడదు. కానీ రష్యా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.


ఒకవేళ పుతిన్‌తో తన సమావేశం సఫలమైతే.. వెంటనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని కూడా కలుపుకొని మరో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అదీ వాళ్లిద్దరి మధ్య తాను ఉండాలని వారు కోరుకుంటే ఉంటానని వ్యాఖ్యానించారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్‌లో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌ మొత్తాన్ని రష్యా ఆక్రమించగలదన్నట్టుగా పుతిన్‌ బుకాయిస్తున్నారు. ట్రంప్‌తో భేటీకానున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్న వారందరి మీదా ముందుగానే ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా, యూరప్‌ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాపై పెద్దగా ప్రభావం చూపడం లేదన్నట్టుగా పుతిన్‌ వ్యవహరిస్తున్నారు. కానీ ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగిలింది’’ అని పేర్కొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 05:19 AM