Share News

International Diplomacy: రష్యా చమురును భారత్‌ అస్సలు కొనదు

ABN , Publish Date - Oct 19 , 2025 | 04:38 AM

భారత్‌ రష్యా నుంచి చమురును అస్సలు కొనదని, కొనుగోళ్లు ఇప్పటికే తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు.

International Diplomacy: రష్యా చమురును భారత్‌ అస్సలు కొనదు

  • ఇప్పటికే కొనుగోళ్లు తగ్గించేసింది.. భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపా

  • పాక్‌-అఫ్గాన్‌ యుద్ధాన్ని చిటికెలో ఆపగలను

  • జెలెన్‌స్కీతో భేటీ అనంతరం ట్రంప్‌

  • వెంటనే ఉన్నది ఉన్నట్టుగా యుద్ధం ఆపేయాలని రష్యా, ఉక్రెయిన్‌లకు పిలుపు

వాషింగ్టన్‌, అక్టోబరు 18: భారత్‌ రష్యా నుంచి చమురును అస్సలు కొనదని, కొనుగోళ్లు ఇప్పటికే తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. శ్వేతసౌధంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ తర్వాత ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘రష్యా నుంచి భారత్‌ అస్సలు చమురు కొనుగోలు చేయదు. ఇప్పటికే తగ్గించేసింది, దాదాపు పూర్తిగా ఆపేసింది. ఇకపై కొనదు..’’ అని పేర్కొన్నారు. భారత్‌, పాక్‌ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి వ్యాఖ్యానించారు. మరెన్నో యుద్ధాలను కూడా ఆపానని.. కావాలనుకుంటే పాక్‌-అఫ్గానిస్థాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చిటికెలో పని అని పేర్కొన్నారు. యుద్ధాలను ఆపడం ద్వారా కోట్లాది మంది ప్రాణాలు కాపాడానన్నారు.

ఉన్నది ఉన్నట్టుగా ఆపేయండి.

ఉక్రెయిన్‌, రష్యా రెండు దేశాలు కూడా ఉన్నది ఉన్నట్టుగా, ఎక్కడున్నవాళ్లు అక్కడ యుద్ధాన్ని ఆపేయాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. లేకపోతే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని పేర్కొన్నారు. రష్యా ఆక్రమించిన భూభాగాలను వదులుకోవాలని ఉక్రెయిన్‌కు పరోక్షంగా స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే చాలా రక్తపాతం జరిగింది. ఇక చాలు. వెంటనే ఎక్కడ ఏది ఎలా ఉన్నది అలా యుద్ధాన్ని ఆపేయండి. ఇద్దరూ ఎవరికివారు విజయం సాధించినట్టు ప్రకటించుకోండి. ఏదైనా ఉంటే చరిత్ర నిర్ణయిస్తుంది..’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు తొమహాక్‌ క్షిపణులు ఇచ్చే ఉద్దేశం లేదని ట్రంప్‌ సంకేతాలు ఇచ్చారు. తొమహాక్‌లు అవసరం రాకపోవడమే మంచిదని, నిజాయతీగా చెప్పాలంటే యుద్ధం ముగియడమే మంచిదని జెలెన్‌స్కీకి సూచించారు. ఇక కాల్పుల విరమణకు, చర్చలకు సమయం ఆసన్నమైందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ట్రంప్‌ చెబుతున్నది నిజమని, మొదట మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆగి, ఆ తర్వాతే మాట్లాడాలని వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 19 , 2025 | 04:38 AM