Trump-India Negotiations: భారత్‌పై 25 శాతం సుంకం విధింపు.. ట్రంప్ మరో కీలక ప్రకటన
ABN , Publish Date - Jul 31 , 2025 | 09:31 AM
భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించిన ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. తదుపరి ఏం జరుగుతుందో చూడాలంటూ ముక్తాయించారు. శ్వేత సౌధంలో జరిగిన పత్రికా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తామని ఇటీవల ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. శ్వేత సౌధంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, అమెరికా వస్తువులపై అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఒకటని మరోసారి పేర్కొన్నారు.
పాతిక శాతం సుంకాల విధింపు తరువాత భారత్‌తో చర్చలు కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. ‘మేము ప్రస్తుతం వారితో చర్చలు జరుపుతున్నాము. ఏం జరుగుతుందో చూడాలి మరి. కానీ అమెరికా ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. వారు 100 - 150 శాతం వరకూ సుంకాలు విధిస్తున్నారు. కొన్నిసార్లు 175 శాతం అంతకంటే ఎక్కువ టారిఫ్ విధించారు’
‘ఇక భారత్ బ్రిక్స్ కూటమిలో కూడా భాగమే. ఇది అమెరికా వ్యతిరేక కూటమి. ఇందులో భారత్ భాగమంటే కాస్త ఆశ్చర్యకరమే. ఇది డాలర్‌పై దాడిగా భావించాలి. డాలర్‌ను బలహీనపరిచే ఎలాంటి ప్రయత్నాలను మేము సహించము. సుంకాల విధింపు వెనక బ్రిక్స్ ప్రభావం కొంత, వాణిజ్య లోటు ప్రభావం కొంత ఉంది. వాస్తవానికి ప్రధాని మోదీ నా మిత్రుడే. కానీ వాళ్లు మనతో పెద్దగా వాణిజ్యం చేయట్లేదు. వాళ్లు మనకు బోలెడన్ని వస్తువులు విక్రయిస్తారు. కానీ మనం వారికి పెద్దగా ఏవీ విక్రయించలేకపోతున్నాము. ఎందుకంటే వాళ్ల సుంకాలు అధికం. అయితే, సుంకాల తగ్గింపునకు భారత్ సుముఖంగానే ఉంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి’ అని అన్నారు.
ఇక పాక్‌లో వ్యూహాత్మక చమురు నిల్వల ఏర్పాటుపై అవగాహనకు వచ్చినట్టు కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకోసం ఇంధన కంపెనీ ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్టు చెప్పారు. చమురు నిల్వలు సిద్ధమయ్యాక పాక్ భారత్‌కు ఆయిల్ విక్రయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఇతర దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలపై ముమ్మర చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఆగస్టు 1 నుంచి భారత్ నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం సుంకంతో పాటు అదనపు పెనాల్టీలు విధిస్తామని డొనాల్ట్ ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌తో వాణిజ్యలోటు, రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ప్రపంచానికి ట్రంప్ వార్నింగ్.. మాతో ఒప్పందాలు కుదుర్చుకోకపోతే..
వలసలపై ట్రంప్ హెచ్చరికలు.. ఈ ఆక్రమణను అడ్డుకోవాలని ఐరోపా దేశాలకు పిలుపు
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి