Trump - Crypto Investment Loss: క్రిప్టో పెట్టుబడులతో నష్టాలు.. ట్రంప్ కుటుంబ ఆస్తుల విలువ ఢమాల్
ABN , Publish Date - Nov 25 , 2025 | 08:39 AM
క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు ట్రంప్ కుటుంబానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. గత రెండు నెలల్లో కుటుంబ ఆస్తుల విలువలో ఏకంగా 1 బిలియన్ డాలర్ల మేర కోత పడింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి క్రిప్టో పెట్టుబడుల కారణంగా భారీ షాక్ తగిలింది. పెద్ద ఎత్తున నష్టాలు ఎదురవడంతో ఆయన కుటుంబ ఆస్తుల విలువ ఏకంగా ఒక బిలియన్ డాలర్ల మేర పడిపోయింది. బ్లూమ్‌బర్గ్ సంస్థ కథనం ప్రకారం, నష్టాల రిస్క్ ఎక్కువగా ఉండే డిజిటల్ ఆస్తులపై ట్రంప్ కుటుంబం పెట్టిన భారీ పెట్టుబడులు ఈ మధ్య నష్టాలను తీసుకొచ్చాయి. సెప్టెంబర్‌లో ట్రంప్ కుటుంబ ఆస్తుల విలువ 7.7 బిలియన్ డాలర్లు. కానీ నేడు వాటి విలువ 6.7 బిలియన్ డాలర్‌లకు పడిపోయింది. ఈ నష్టాల్లో అధిక శాతం మీమ్ కాయిన్స్, ఇతర స్పెక్యులేటివ్ క్రిప్టో పెట్టుబడుల కారణంగా వచ్చాయి (Trump Family Crypto Investment Losses).
ఇటీవల కాలంలో ట్రంప్ బ్రాండెడ్ మీమ్ కాయిన్ విలువ ఏకంగా 25 శాతం మేర పతనమైంది. ఓ బిట్ కాయిన్ మైనింగ్ సంస్థలో ట్రంప్ తనయుడు ఎరిక్‌కు ఉన్న వాటా విలువ కూడా ఒకప్పటి గరిష్ఠ స్థాయితో పోలిస్తే సగం మేర పతనమైంది. సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ మాతృ సంస్థ ట్రంప్ మీడియా అండ టెక్నాలజీ గ్రూప్ (టీఎమ్‌టీజీ) షేర్లు కూడా భారీ స్థాయిలో పతనమయ్యాయి. ఇక ఈ సంస్థలో ట్రంప్‌నకు ఉన్న వాటా విలువ గత రెండు నెలల్లో 800 మిలియన్ డాలర్ల మేర తగ్గింది. టీఎమ్‌టీజీలో ట్రంప్ అతిపెద్ద షేర్ హోల్డర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
ట్రంప్‌పై విశ్వాసంతో క్రిప్టో పెట్టుబడులు పెట్టిన వారు కూడా దెబ్బతిన్నారు. ట్రంప్ బ్రాండెడ్ మీమ్ కాయిన్ విలువ జనవరితో పోలిస్తే భారీ స్థాయిలో పతనమైంది. అయితే, ఇది నిరుత్సాహం చెందాల్సిన సమయం కాదని డొనాల్డ్ ట్రంప్ తనయుడు ఎరిక్ ట్రంప్ భరోసా ఇచ్చారు. క్రిప్టో కొనుగోళ్లకు ఇదే కరెక్ట్ సమయం అని అన్నారు. కంగారు పడి పక్కదారి పట్టొద్దని సూచించారు. క్రిప్టో కరెన్సీ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేశారు.
స్థూలంగా చూస్తే మాత్రం క్రిప్టో పెట్టుబడులు ట్రంప్ కుటుంబానికి కనక వర్షం కురిపించాయని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆయన కుటుంబం క్రిప్టో పెట్టుబడుల వైపు మళ్లింది. ఇటీవలి నష్టాలను అటుంచితే.. వారి ఆస్తుల విలువ గతంతో పోలిస్తే బిలియన్‌ల డాలర్ల మేర పెరిగింది.
ఇవి కూడా చదవండి..
కెనడా పౌరసత్వ చట్టంలో సవరణ.. భారత సంతతి వారికి గోల్డెన్ ఛాన్స్
జెలెన్‌స్కీపై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్.. కృతజ్ఞత లేదని ఆగ్రహం
Read Latest International And Telugu News