Donald Trump: పసిబిడ్డ దగ్గర చాక్లెట్ లాక్కున్నట్లు.. బైడెన్ నుంచి జెలెన్‌స్కీ సొమ్ములు
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:30 AM
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకున్నా ఆయనకు కనీసం కృతజ్ఞత లేదని విమర్శించారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడికి కృతజ్ఞత లేదు: ట్రంప్
వాషింగ్టన్, మార్చి 10: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకున్నా ఆయనకు కనీసం కృతజ్ఞత లేదని విమర్శించారు. పసిబిడ్డ నుంచి చాక్లెట్ లాక్కొన్నంత సులువుగా బైడెన్ ప్రభుత్వం నుంచి జెలెన్‌స్కీ నిధులు తీసుకున్నారని ఆరోపించారు. ఆదివారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ట్రంప్ వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ ఓ తెలివైన, కఠినమైన వ్యక్తి అని అభివర్ణించారు.
రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం చేయడానికి ఇప్పటి వరకు 350 బిలియన్ డాలర్ల మేర సాయం చేశామని అయినా జెలెన్‌స్కీకి కృతజ్ఞత లేదని మండిపడ్డారు. ఇక రష్యా విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించిన అధ్యక్షుడిని తానేనని ట్రంప్ అన్నారు. రష్యా పైపు లైన్ ఆపి ఆంక్షలు విధించానని, కానీ, రష్యా అధ్యక్షుడితో మంచి సంబంధాలే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.