Share News

Drone attacks : ‘ఉగ్ర’ డ్రోన్ల ఉపద్రవం!

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:49 AM

ప్రపంచంలోని పలు దేశాల్లో.. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదులు ఇటీవల తరచుగా డ్రోన్‌ దాడులతో భయాందోళనలు సృష్టిస్తున్నారు! కానీ అవన్నీ చిన్నాచితకా దాడులు. సూడాన్‌లో ఆస్పత్రిపై తిరుగుబాటుదారులు జరిపింది చాలా పెద్ద దాడి. సింగపూర్‌లోని ‘ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పొలిటికల్‌

Drone attacks : ‘ఉగ్ర’ డ్రోన్ల ఉపద్రవం!

ఆఫ్రికా దేశాల్లో కొన్నేళ్లుగా నిఘా, పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తున్న ఉగ్రవాద సంస్థలు

ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పాతం.. సూడాన్‌ ఆస్పత్రిపై డ్రోన్‌ దాడి ఆ కోవలోనిదే

ఇదే రీతిలో ఇక్కడ ఉగ్రమూకలు దాడి చేస్తే?.. ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా?

మణిపూర్‌లో విద్రోహశక్తుల డ్రోన్‌ దాడులు.. అక్కడ యాంటీడ్రోన్‌ వ్యవస్థ ఏర్పాటు

పోలీసులకూ రోగ్‌ డ్రోన్లను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎన్‌ఎ్‌సజీ మాజీ చీఫ్‌ గణపతి

సూడాన్‌లో ఆస్పత్రిపై డ్రోన్‌ దాడి.. 70 మంది మృతి, 19 మందికి గాయాలు

కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు. ప్రమాద సమయంలో ఆత్మరక్షణకు వినియోగించుకోవచ్చు. లేదా.. దాన్నో మారణాయుధంగా కూడా వాడి ఇతరుల ప్రాణాలు తీయొచ్చు!! ఏ పరికరమైనా.. పరిజ్ఞానమైనా.. వాడుకునేవారి మనస్తత్వాన్ని బట్టి దాని ఉపయోగం ఉంటుంది. ప్రయాణికులను చేరవేయడానికి ఉపయోగించే విమానాలనే ఆయుధాలుగా మార్చి అమెరికాలో జంట హర్మ్యాలను కూల్చేసిన అల్‌ఖైదా దురాగతం ఇందుకు ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు కాలం మారింది. ప్రాణాలను రిస్క్‌ చేసి మరీ అంత పెద్ద పెద్ద విమానాలను హైజాక్‌ చేయాల్సిన పని లేకుండా.. ఉగ్రవాదులు తమ దాడులకు చిన్నగా ఉండే డ్రోన్లను వాడటం మొదలుపెట్టారు.

ప్రపంచంలోని పలు దేశాల్లో.. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదులు ఇటీవల తరచుగా డ్రోన్‌ దాడులతో భయాందోళనలు సృష్టిస్తున్నారు! కానీ అవన్నీ చిన్నాచితకా దాడులు. సూడాన్‌లో ఆస్పత్రిపై తిరుగుబాటుదారులు జరిపింది చాలా పెద్ద దాడి. సింగపూర్‌లోని ‘ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పొలిటికల్‌ వయొలెన్స్‌ అండ్‌ టెర్రరిజం రిసెర్చ్‌’కు చెందిన ర్యూబెన్‌దా్‌స ప్రకారం.. ఇన్నాళ్లుగా ఆఫ్రికాలోని ఉగ్రవాదులు ‘ప్యాసివ్‌-డిఫెన్సివ్‌’ ప్రయోజనాల నిమిత్తమే డ్రోన్లను ఎక్కువగా వాడుతున్నారు. అంటే.. నిఘా, పర్యవేక్షణ, చిత్రీకరణ వంటివాటికి మాత్రమే. ఉదాహరణకు.. 2020లో కెన్యాలోని మండాలో ఉన్న అమెరికా మిలటరీ బేస్‌ చిత్రీకరణకు అల్‌షహాబ్‌ అనే ఉగ్రవాద సంస్థ డ్రోన్లను ఉపయోగించింది. ఇస్లామిక్‌ స్టేట్‌ వెస్ట్‌ ఆఫ్రికా ప్రావిన్స్‌.. 2022లో నైజీరియాలో సైనిక స్థావరాలపై నిఘాకు డ్రోన్లను వాడింది. నెల తర్వాత ఆ స్థావరాలపై ఆ సంస్థ సభ్యులు దాడులు చేశారు. కానీ, కొద్దిరోజులుగా వారు వాటిని ‘యాక్టివ్‌-అఫెన్సివ్‌’ రీతిలో.. అంటే బాంబుదాడులకు వాడుతున్నారు. ఈ దాడులకు వారు వినియోగిస్తున్నవి కూడా మార్కెట్లో సులభంగా దొరికే, పౌర ప్రయోజనాలకు ఉపయోగించే క్వాడ్‌కాప్టర్లేనని ర్యూబెన్‌దా్‌స వెల్లడించారు. అలాంటి దాడుల్లో అతిపెద్దది తాజాగా సూడాన్‌లో జరిగిన దాడి. ఇది ఇలాగే కొనసాగి.. టెర్రరిస్టులు తమ దాడులకు డ్రోన్లనే ప్రధాన ఆయుధాలుగా ఎంచుకుంటే పెనుప్రమాదమేనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏడెనిమిదేళ్ల క్రితం దాకా డ్రోన్లను అంతా విచిత్రంగా చూసేవారు! కానీ.. పెళ్లిళ్లలో డ్రోన్‌ ఫొటోగ్రఫీ పాపులర్‌ అయ్యాక అవి అందరికీ చిరపరిచితమయ్యాయి. క్రమంగా వ్యవసాయం, మైనింగ్‌, టెలికం, విపత్తుల నిర్వహణ, జియో మ్యాపింగ్‌, అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పర్యవేక్షణ.. ఇలా చాలా రంగాలకు డ్రోన్లు విస్తరించాయి.


ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్లు వాడేస్తే

ఒకచోట నుంచి చేతిలో కంట్రోలర్‌ ద్వారా డ్రోన్‌ను కావాల్సిన చోటుకు పంపి కావాల్సిన పని చేయించుకునే వీలున్న నేపథ్యంలో.. ఆ డ్రోన్లను ఉగ్రవాదులు ఇష్టం వచ్చినట్టు వాడితే? 2008లో ముంబైలో పాక్‌కు చెందిన లష్కరే తాయిబా ఉగ్రవాది కసబ్‌, అతడి సహచరులు సృష్టించిన విధ్వంసం గుర్తుందా? అలాంటి రాక్షసమూక డ్రోన్లను వాడడం ప్రారంభిస్తే? ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించడానికి, ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలిగించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉగ్రవాదులు ఈ టెక్నాలజీని వాడుకుంటే? అనే ఆలోచనకే వణుకు పుడుతోంది. ఉగ్రవాదులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్రవాదులు, వేర్పాటువాదులు వాటిని ఆయుధాలుగా మార్చుకుని సామాన్యప్రజలే లక్ష్యంగా విరుచుకుపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది మణిపూర్‌లో అల్లర్లు జరిగిన సమయంలో కూడా.. విద్రోహ శక్తులు డ్రోన్‌ బాంబులతో రెండుచోట్ల దాడులకు పాల్పడ్డాయి! ఆ దాడుల్లో ఇద్దరు మరణించారు.

అంతపెద్ద రష్యానే తట్టుకోలేక..

చూడ్డానికి చిన్నగా కనిపిస్తాయి గానీ.. పక్కాగా వాడితే డ్రోన్లు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు! అగ్రరాజ్యమైన అంత పెద్ద రష్యాయే.. ఉక్రెయిన్‌ ప్రయోగిస్తున్న డ్రోన్ల దెబ్బకు తట్టుకోలేక సతమతమవుతోంది. ఉక్రెయిన్‌ డోన్ల బారి నుంచి తన యుద్ధట్యాంకులను కాపాడుకోవడానికి ప్లైవుడ్‌ షీట్లు, రూఫ్‌ ప్యానెలింగ్‌ రేకులు, ఇనుపచువ్వలతో రక్షణ కవచాలు కట్టి వాటిని గుడిసెల్లా తయారుచేస్తోంది! తమపై దండయాత్రకు దిగిన రష్యాను రెండేళ్లకపైగా ఉక్రెయిన్‌ నిలువరించగలుగుతోందంటే దానికి ప్రధాన కారణం ఆ దేశం వాడుతున్న డ్రోన్లే!! అయితే అలా దేశాల మధ్య గొడవల్లో.. సరిహద్దుల్లో డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు సైన్యం వద్ద రకరకాల ప్రణాళికలు ఉంటాయి. మన సైన్యం కూడా సరిహద్దుల ఆవలి నుంచి వచ్చే డ్రోన్లను పసిగట్టి, వాటి పనిపట్టడానికి ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసింది. అలా కాకుండా.. ఫొటోగ్రఫీకి వాడే డ్రోన్లకే బాంబులు అమర్చి దేశంలోని ప్రధాన నగరాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే? ఆ రోగ్‌ డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు మన పోలీసులు సన్నద్ధంగా ఉన్నారా అనేదే వెయ్యిరూకల ప్రశ్న!!

-సెంట్రల్‌ డెస్క్‌


Also Read: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..

Also Read: అసహనానికి పరాకాష్ట.. కేటీఆర్

Also Read : పద్మ పురస్కారంపై స్పందించిన బాలయ్య బాబు

Updated Date - Jan 27 , 2025 | 04:50 AM