Share News

Christian Preaching: ఖతర్‌ పోలీసుల అదుపులో తెలుగు పాస్టర్లు

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:08 AM

ఖతర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం నిర్వహిస్తున్నారనే అభియోగంపై పలువురు క్రైస్తవ మతప్రచారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమచారం మేరకు..

Christian Preaching: ఖతర్‌ పోలీసుల అదుపులో తెలుగు పాస్టర్లు

  • దోహాలో అనుమతి లేకుండా క్రైస్తవ మత ప్రచారం

  • దేశం విడిచి వెళ్లడానికి ఇంకా అనుమతించని వైనం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ఖతర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం నిర్వహిస్తున్నారనే అభియోగంపై పలువురు క్రైస్తవ మతప్రచారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమచారం మేరకు.. దోహా నగరంలోని తుమమా అనే ప్రాంతంలో మత ప్రచారం చేస్తున్న మొత్తం 11 మందిలో ఐదుగురు తెలుగు పాస్టర్లు ఉన్నారు. అందులో ముగ్గురు సందర్శక వీసాలపై వచ్చి మతప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు వారాలకు పైగా అదుపులో ఉంచి విచారించిన అనంతరం పోలీసులు వీరిని ఇటీవల విడుదల చేసినా, దేశం విడిచి వెళ్లడానికి మాత్రం ఇంకా అనుమతించలేదు. ఖతర్‌లో క్రైస్తవులు ప్రార్థనలు చేసుకోవడానికి బర్వా అనే ప్రాంతంలో ప్రత్యేకంగా సువిశాల కాంపౌండ్‌ ఉంది. అందులోని చర్చిలకు చట్టబద్ధత ఉంది. ఈ చర్చిల్లో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి భారత్‌ నుంచి వచ్చేవారికి ప్రత్యేకంగా సందర్శక వీసాలను కూడా ఖతర్‌ ప్రభుత్వం జారీ చేస్తుంటుంది. కానీ స్థానిక చట్టాలకు విరుద్ధంగా భారతీయులు కొందరు కొన్ని ప్రైవేటు నివాస స్థలాల్లో, విల్లాల్లో, ఎక్కడబడితే అక్కడ చర్చిలు నిర్వహించుకుంటుండగా, వారిలో తెలుగువారు ప్రముఖంగా ఉన్నారు. చట్టబద్ధమైన అనుమతి ఉన్న తెలుగు చర్చిల కంటే, ఇలా అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న చర్చిలకు జనం తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఖతర్‌, ఇతర గల్ఫ్‌ దేశాల్లో చట్టబద్ధంగా ప్రార్థన సేవలు ఉన్నా, అనుమతి లేకుండా అన్యమత ప్రచారం చేయడం మాత్రం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. గతంలో సిక్కులు కూడా ఒక ప్రదేశంలో అనధికారికంగా గురుద్వారా నిర్వహిస్తుండగా నిర్వహకులను పోలీసులు అరెస్ట్‌ చేసి దాన్ని మూసివేశారు.

Updated Date - Jun 16 , 2025 | 04:10 AM