Gold-like Particles: చెట్లకు బంగారం కాస్తోంది
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:21 AM
ఇంట్లో పిల్లలో.. పెద్దలో అలవికాని కోరికల చిట్టా విప్పితే ‘డబ్బు ఏమైనా చెట్లకు....
ఫిన్లాండ్‌లోని స్ర్పూస్ చెట్లకు పుత్తడి కాత
ఆకుల కొసల్లో బంగారు రేణువులు
న్యూఢిల్లీ, అక్టోబరు 21: ఇంట్లో పిల్లలో.. పెద్దలో అలవికాని కోరికల చిట్టా విప్పితే ‘డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందనుకుంటున్నారా?’ అని ఇంటిపెద్దగా రుసరుసలాడుతుంటాం! మరి.. ఈ నానుడి నిజమైతే ఎలా ఉంటుంది? ఔను.. చెట్లకు డబ్బులు కాసేరోజులొచ్చేశాయి. తళతళలాడే కరెన్సీ నోట్ల రూపంలో కాదు గానీ ధగధగ మెరిసే అచ్చమైన బంగారం రూపంలో! బంగారం కాసే ఆ చెట్టు పేరు ‘నార్వే స్ర్పూస్’! ఈ చెట్లకు దాదాపు బంగారు రంగులో మిలమిల మెరిసే పదునైన సూదుల్లాంటి ఆకులుంటాయి. వీటి కొసకొసల్లో బంగారు రేణువులు ఉత్పత్తవుతున్నాయి. వీటిని బయటకు తీసి ప్రత్యేక పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే నిగనిగలాడే బంగారం ఉత్పత్తి అవుతుంది. ఫిన్లాండ్‌లోని అడవుల్లో ఈ చెట్లున్నాయి. ఉత్తర ఫిన్లాండ్‌లోని కిట్టిలా గోల్డ్‌మైన్ సమీపంలో ఉన్న 23 స్ర్పూస్ చెట్లపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్, ఔలు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 138 రకాల ఆకుల శాంపిళ్లు సేకరించి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించారు. నేల లోపల ఉండే బంగారం.. వేర్లు పీల్చుకునే నీటి ద్వారా చెట్ల ఆకుల్లోకి వస్తోందని.. అక్కడ ఘనరూపంలో అత్యంత సూక్ష్మకణాలుగా మారుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ఆకుల్లోని బ్యాక్టీరియా బయోఫిల్మ్స్ మధ్య నానో సైజ్ గోల్డ్ పార్టికల్స్ ఉన్నట్లు గుర్తించారు. నేలలోంచి బంగారం చెట్ల వేర్ల ద్వారా ఆకుల్లోకి చేరే క్రమంలో ఎండోఫైట్స్ అనే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు కనుగొన్నారు. అన్నట్టు.. మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లుగానే అన్ని స్ర్పూస్ చెట్లకు ఈ బంగారు లక్షణాలు లేవు. నీటి ప్రవాహమార్గాలు, సూక్ష్మజీవులు, నేల స్వభావం అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని స్పూస్ చెట్లకే ఈ బంగారం కాస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కల ఆధారిత బంగారం అన్వేషణకు ఈ అధ్యయనం బాగా ఉపకరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిశోధనలు ఇంకా సాగుతున్నాయి. ఈ స్ర్పూస్ చెట్లు ప్రపంచమంతా విస్తరిస్తే విశ్వమంతా పసిడిమయమే అవుతుంది కదూ.