Share News

Trump Revealed 2 వేల తొమహాక్‌ క్షిపణులు ఉక్రెయిన్‌కు ఇవ్వాలా

ABN , Publish Date - Oct 18 , 2025 | 05:10 AM

ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధాన్ని ఆపి, శాంతికాముకుడిగా పేరుపొందాలని తపిస్తున్న ట్రంప్‌....

Trump Revealed 2 వేల తొమహాక్‌ క్షిపణులు ఉక్రెయిన్‌కు ఇవ్వాలా

  • పుతిన్‌ను హెచ్చరించా.. ఇవ్వొద్దని ఆయన అభ్యర్థించారు: ట్రంప్‌

వాషింగ్టన్‌/మాస్కో, అక్టోబరు 17: ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధాన్ని ఆపి, శాంతికాముకుడిగా పేరుపొందాలని తపిస్తున్న ట్రంప్‌.. ఇందుకోసం కీలకమైన తొమహాక్‌ క్షిపణుల అంశాన్ని లేవనెత్తారు. ఉక్రెయిన్‌కు వేల తొమహాక్‌ క్షిపణులు ఇవ్వమంటారా అని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నేరుగా బెదిరించానని గురువారం రాత్రి వెల్లడించారు. అలా చేయవద్దంటూ పుతిన్‌ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారని తెలిపారు. ‘‘పుతిన్‌ నాకు ఫోన్‌ చేశారు. గాజాలో శాంతి ఒప్పందం కుదర్చడంపై అభినందించారు. ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణపై చర్చించా. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు ఓ రెండు వేల తొమహాక్‌ క్షిపణులు ఇస్తే మీకేమైనా అభ్యంతరమా అని పుతిన్‌ను అడిగా. నిజంగానే నేరుగా ఇలాగే అడిగా. కానీ ఇది ఆయనకు నచ్చలేదు. ఇవ్వవద్దని అభ్యర్థించారు. అమెరికా వద్ద పెద్ద సంఖ్యలో తొమహాక్‌ క్షిపణులు ఉన్నాయి. అయినా అమెరికా కోసం అవి అవసరం. అంటే మాకు కొరత తలెత్తకుండా చూసుకోవాలి కదా. శుక్రవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నన్ను కలుస్తున్నారు. పుతిన్‌తో ఏం మాట్లాడినదీ ఆయనకు చెప్తాను’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇక కాగా, ఉక్రెయిన్‌తో యుద్ధం నిలిపివేత, వాణిజ్య అంశాలపై చర్చించేందుకు హంగరీలోని బుడాపెస్ట్‌ నగరంలో పుతిన్‌తో భేటీకానున్నట్టు ట్రంప్‌ వెల్లడించారు. రెండు వారాల్లో ఈ సమావేశం ఉండవచ్చని తెలిపారు. వాస్తవానికి రష్యాలోని కీలక మిలటరీ ప్రాంతాలపై దాడులు చేయడం కోసం తమకు తొమహాక్‌ క్షిపణులు ఇవ్వాలని ఉక్రెయిన్‌ ఎప్పటినుంచో కోరుతోంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాలో ట్రంప్‌తో త్వరలో భేటీకానున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌కు పుతిన్‌ ఫోన్‌ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌లోని చెర్విన్‌స్కా పట్టణంలోని ఒక పార్కుకు ట్రంప్‌ పేరు పెట్టారు. ‘‘ఇప్పటి వరకు కజ్కా పేరిట ఉన్న ఈ పార్కుకు.. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న ట్రంప్‌ పేరును పెట్టాలని నిర్ణయించాం. ఎన్నో యుద్ధాలు ఆపిన ఆయన మరో యుద్ధాన్ని కూడా ఆపి శాంతిని నెలకొల్పుతారని ఆశిస్తున్నాం. ఆయనను మా నగరానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం’’ అని ఆ పట్టణ కౌన్సిలర్‌ మరైనా సెమెనెన్కో వెల్లడించారు.

  • సౌదీ, యూఎస్‌ రక్షణ

  • ఒప్పందంపై చర్చలు

అమెరికా, సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.

Updated Date - Oct 18 , 2025 | 05:11 AM