Sheikh Hasina: అధికారం చేపట్టడానికైనా.. ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా సిద్ధం: షేక్ హసీనా
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:12 PM
తాను వచ్చే సంవత్సరం బంగ్లాదేశ్ లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. ఒకవేళ తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. తమ లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 29: ప్రధాని పీఠం నుంచి దిగిపోయి బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చిన మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నగరం ఢిల్లీలో తాను స్వేచ్ఛగా నివసిస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబంపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థుల ఆందోళనలతో బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగడంతో ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనా దిగిపోయారు. గతేడాది ఆగస్టు 5 నుంచి అక్కడి నుంచి వచ్చి ఇండియాలో తలదాచుకుంటున్నారు. ఈ అల్లర్లలో 1400 మంది మృతి చెందారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. చాలా కాలం తరువాత బుధవారం తొలిసారిగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
తాను వచ్చే సంవత్సరం బంగ్లాదేశ్‌లో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు. ఒకవేళ తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే.. తమ లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారని చెప్పారు. బంగ్లాదేశ్‌లో రాజ్యాంగ పాలన, రాజకీయ స్థిరత్వం తీసుకురావాలంటే మళ్ళీ తమ ప్రభుత్వం అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో బంగ్లాలో అధికారం చేపట్టడానికైనా, ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు.
తనపై అక్కడి యూనస్ ప్రభుత్వం చేసిన ఆరోపణలను హసీనా తీవ్రంగా ఖండించారు. అవన్నీ రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టడానికి చేసిన కుట్రగా పేర్కొన్నారు. తనపై అభియోగాలు నమోదు చేసే ముందు బంగ్లాలోని కోర్టులు కూడా తనకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. తాను దేశం విడిచాక అవామీ లీగ్ నేతలపై దాడులు చేయడం, పార్టీపై నిషేధం విధించడంతో తమ స్వీయ ఓటమిని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఒప్పుకుందని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump Praises PM Modi: ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన డొనాల్డ్ ట్రంప్..