Share News

Sindh Underground Tunnels: సింధ్‌ కొండల్లో రహస్య సొరంగాలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:40 AM

పాకిస్థాన్‌ అణ్వాయుధాలను పరీక్షిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను మన దాయాది దేశం నిజం చేస్తున్నట్టే కనిపిస్తోంది.

 Sindh Underground Tunnels: సింధ్‌ కొండల్లో రహస్య సొరంగాలు

  • భూగర్భ గదులూ నిర్మిస్తున్న పాకిస్థాన్‌ సైన్యం!

  • అణ్వాయుధ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దాయాది

  • నోరియాబాద్‌, కంబేర్‌-షాదాద్‌కోట్‌ల్లో శరవేగంగా పనులు

  • ఇవి ‘అణు’ సన్నాహాలే.. సింధ్‌ ప్రాంత సంస్థల వాదన

  • అడ్డుకోవాలంటూ ప్రపంచ సంస్థలకు లేఖలు

ఇస్లామాబాద్‌, నవంబరు 6: పాకిస్థాన్‌ అణ్వాయుధాలను పరీక్షిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను మన దాయాది దేశం నిజం చేస్తున్నట్టే కనిపిస్తోంది. అణు పరీక్షల కోసం సింధ్‌ ప్రాంత కొండలను ఆ దేశం సిద్ధం చేస్తున్నదన్న వార్తలు వస్తున్నాయి. దీనికోసం పాక్‌ సైన్యం అక్కడి కొండలను తొలచి రహస్య సొరంగాలను, భూగర్భ గదులను నిర్మిస్తున్నదంటూ సింధూదేశ్‌ అనే వేర్పాటువాద సంస్థ, అక్కడి పౌర సమాజ గ్రూపులు వాదిస్తున్నాయి. ఈ ప్రయత్నం నుంచి పాక్‌ను అడ్డుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్‌సతోపాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఐరాస అనుబంధ మానవహక్కులు, అణు నిరాయుధీకరణ విభాగాల ప్రతినిధులకు అవి లేఖలు రాశాయి. అతి గోప్యంగా అణు పరీక్షలు నిర్వహించడం లేక భారత దాడులకు అందనంత దూరంగా తన అణ్వాయుఽధ నిల్వలను తరలించడం అనేది ఈ సన్నాహాల వెనుక పాక్‌ ఉద్దేశం అయి ఉండవచ్చునని అవి తెలిపాయి. దీనివల్ల సింధ్‌ ప్రాంత భద్రత ప్రమాదంలో

సింధ్‌ కొండల్లో రహస్య సొరంగాలు

పడనున్నదని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశాయి. సింధ్‌ ముత్తహిద మహజ్‌ అనే పౌర సమాజ గ్రూపు చైర్మన్‌ షఫీ బుర్ఫాత్‌ పేరిట మీడియాకు విడుదల చేసిన ఈ లేఖలో సింధ్‌లో ఎక్కడెక్కడ సొరంగాలను తవ్వుతున్నారనే వివరాలను పొందుపరిచారు. జంషోరోకు ఉత్తరంగా నోరియాబాద్‌ ప్రాంతంలో, మంచార్‌ కాలువకు పశ్చిమంగా కంబేర్‌-షాదాద్‌కోట్‌ ప్రాంతంలో పెద్ద పెద్ద సొరంగాలు, వివిధ ఆకృతుల్లో విశాలమైన భూగర్భ గదులను నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అటు వైపు ఎవరూ పోకుండా సైన్యాన్ని కాపలా ఉంచారని పేర్కొన్నారు. అణ్వాయుధాలను పరీక్షించడం లేక తత్సంబంధ కార్యకలాపాల వల్ల తాము తీవ్రమైన పర్యావరణ సమస్యలకు గురికావడంతోపాటు రేడియోధార్మికత ప్రభావంతో ప్రాణాంతక వ్యాధులు తమను చుట్టుముట్టే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సాంకేతిక నిపుణులను సింధ్‌ ప్రాంతానికి పంపాలని అణుశక్తి సంస్థను, స్వతంత్ర నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటుచేయాలని ఐరాస జనరల్‌ సెక్రటరీని, మానవ హక్కుల, పర్యావరణ సంబంధ ప్రభావ అంచనా కోసం బృందాలను పంపాలని ఐరాస అనుబంధ విభాగాల ప్రతినిధులను ఆ లేఖలో కోరారు.

Updated Date - Nov 07 , 2025 | 05:40 AM