Second Phase: రెండో దశ శాంతి ఒప్పందంపై సంతకాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:44 AM
గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించిన ట్రంప్ శాంతి ప్రణాళిక రెండో దశ అమలుపై చర్చించి, ఒప్పందం చేసుకునేందుకు ఈజిప్ట్‌లోని......
గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించిన ట్రంప్ శాంతి ప్రణాళిక రెండో దశ అమలుపై చర్చించి, ఒప్పందం చేసుకునేందుకు ఈజిప్ట్ లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో సోమవారం సాయంత్రం శాంతి సదస్సు నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్, టర్కీ, అజర్‌బైజాన్ అధ్యక్షులు, జర్మనీ చాన్సలర్, స్పెయిన్, నార్వే, గ్రీస్, ఇరాక్, కెనడా, పాకిస్థాన్, బ్రిటన్ ప్రధాన మంత్రులు, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, పలు అరబ్, ముస్లిం దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొని చర్చించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, హమాస్ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనలేదు. సదస్సులో మొదట ట్రంప్ మాట్లాడారు. శాంతి ఒప్పందంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్ట్, టర్కీ అధ్యక్షులు అల్ సిస్సి, ఎర్డోగాన్, ఖతార్ ఎమీమ్ షేక్ తమీమ్‌లను అభినందించారు. రెండో దశ ఒప్పందంపై తొలుత ట్రంప్ సంతకం చేయగా, తర్వాత మిగతా దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. గాజా ప్రజలకు మంచి జీవితాన్ని తిరిగి అందించేందుకు భారీ స్థాయిలో పునర్నిర్మాణం చేపడతామని.. ఇందుకోసం భారీగా వ్యయం చేయనున్నామని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే గాజాను నిస్సైనికీకరణ చేయడం తప్పనిసరని స్పష్టం చేశారు. గాజాలో కొత్తగా పాలస్తీనా భద్రతా దళాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా, గాజా పునర్నిర్మాణం కోసం సుమారు రూ.4.7 లక్షల కోట్లు (53 బిలియన్ డాలర్లు) అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు నిధుల సమీకరణ, పునర్నిర్మాణంపై నవంబర్‌లో గాజాలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామని ఈజిప్ట్ తెలిపింది. ఇక కొత్తగా ఏర్పాటు చేసే పాలస్తీనా భద్రతా దళానికి ఈజిప్ట్, జోర్డాన్ శిక్షణ ఇవ్వనున్నాయి.