Priesthood: అమెరికాలో అర్చకత్వం అద్భుతః
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:52 AM
అమెరికా అనగానే ఠక్కున గుర్తొచ్చేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. హెచ్1-బీ వీసాలే!! కానీ.. ఇప్పుడు అర్చకత్వం ఆ రంగంతో పోటీ పడుతోంది! ఐటీ రంగంలో ఉన్నంత అస్థిరత్వం..
పూజారులకు మాంచి డిమాండ్
ఐటీ ఉద్యోగులకు మించి రాబడి!
నిష్ఠగా వ్యవహరించేవారికి పెద్దపీట
రకరకాల వీసాలపై వచ్చి అర్చకత్వం
చదువు కోసం వచ్చి ఓపీటీలో ఉన్న
కొందరు విద్యార్థులదీ అదే బాట
సొంతంగా గుళ్లు నిర్మిస్తున్న వైనం
(డాలస్ నుంచి కిలారు గోకుల్‌కృష్ణ)
అమెరికా అనగానే ఠక్కున గుర్తొచ్చేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. హెచ్1-బీ వీసాలే!! కానీ.. ఇప్పుడు అర్చకత్వం ఆ రంగంతో పోటీ పడుతోంది! ఐటీ రంగంలో ఉన్నంత అస్థిరత్వం.. అర్చకత్వానికి లేదు. మంచి విద్వత్తు, సుస్వరంతో మంత్రం చెప్పగలిగే సామర్థ్యం, నిష్ఠగా వ్యవహరించే అర్చకులకు అగ్రరాజ్యంలో మాంచి గిరాకీ ఉందిప్పుడు. ఒక నివేదిక ప్రకారం.. అమెరికాలో వెయ్యికి పైగా హిందూ ఆలయాలున్నాయి. 1890లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హాజరైన స్వామి వివేకానంద.. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో వేదాంత సమాజాలను స్థాపించారు. ఆ వేదాంత సమాజాలు 1905లో శాన్‌ఫ్రాన్సిస్కోలో తొలి హిందూ దేవాలయాన్ని నిర్మించాయి. ఆ గుడిని ‘ఓల్డ్ టెంపుల్’గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత అమెరికావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, పలు నగరాల్లో పలు ఆలయాలను నిర్మించారు. వాటిలో భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు లేదా పీఠాలకు చెందినవి కొన్ని, ప్రవాసులు కలిసికట్టుగా నిర్మించుకున్నవి కొన్ని ఉండగా.. అమెరికాకు అర్చకత్వం చేయడానికి వచ్చి, కొన్నాళ్ల తర్వాత అర్చకులే సొంతంగా నిర్మించిన గుడులూ కొన్ని ఉన్నాయి. ఒక్క శాన్‌హోజే డౌన్‌టౌన్‌కి 40 కిలోమీటర్ల పరిధిలోనే 200 దాకా దేవాలయాలు ఉన్నాయంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయాల్లో అర్చకులుగా నియమించడానికి.. భారత్‌లోని ప్రముఖ పీఠాలు/మఠాలు/గురుకులాల్లో శిక్షణ పొందిన, వేద పాఠశాలల్లో వేదాధ్యయనం చేసినవారికి పెద్దపీట వేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి హెచ్-1బీ వీసాలాగానే.. అమెరికాలో అర్చకత్వం చేయాలంటే ఆర్-1 వీసా కావాలి. ఆలయాల నిర్వాహకులు ఆర్-1 వీసాపై అర్చకులను తీసుకొచ్చి.. వారికి జీతభత్యాలు ఇవ్వడంతోపాటు, వసతి, బీమా వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇలా వచ్చిన వారికి ప్రారంభ దశలో డిమాండ్ కొంత తక్కువగా ఉంటుంది. కానీ ఆలయాలలో నిలదొక్కుకుని భక్తులతో పరిచయాలు, సంబంధాలు పెంచుకోవడం మొదలుపెట్టాక వారికి డిమాండ్ పెరుగుతుంది. కొన్నేళ్లపాటు అలా చేశాక గ్రీన్‌కార్డు వచ్చిన అర్చకులు.. భక్తుల విరాళాలు, సహకారంతో సొంతంగా ఆలయాలను నిర్మిస్తున్నారు. తద్వారా.. గుడిలో వచ్చే జీతభత్యాల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగాసంపాదిస్తున్నారు. మతపరమైన సంస్థలకు అమెరికా ఆదాయపన్ను శాఖ వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వడం వారికి బాగా కలిసొస్తోంది.
షరతులు వర్తిస్తాయి..
అమెరికాలో అర్చకత్వం చేసేవారికి మంచి సంపాదన ఉంటుందన్న మాట నిజమేగానీ.. అది అందరికీ కాదు. గుడిలోగానీ.. తమ ఇంట్లోగానీ.. పూజలు చేసే పురోహితులు నిష్ఠగా ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు. సూర్యోదయానికి ముందే లేచి, సంధ్యావందనం చేసుకుని, నిత్యనైమిత్తికాలను తూచా తప్పకుండా అనుసరించేవారికి, వేద విద్య/స్మార్త విద్యను బాగా అభ్యసించి.. ఆచారాలను, సంప్రదాయాలను నిష్ఠగా పాటించేవారికే డిమాండ్ ఎక్కువ. గుట్కా, పాన్‌మసాలా వంటి చెడు అలవాట్లు ఉన్నవారికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఎవరూ దొరకని పక్షంలో చివ్వరి ప్రత్యామ్నాయంగా మాత్రమే.. తప్పనిసరి పరిస్థితుల్లో.. వారిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఏడాది పొడుగునా..
గుళ్లో అర్చకత్వంతో పాటు.. వాహన పూజలు, గృహ ప్రవేశం, అన్నప్రాసన, పుట్టినరోజున జరిపించే ఆయుష్షు హోవుమాలు, సత్యనారాయణ వ్రతం, యజ్ఞాలు, శాంతిపూజలు, దోష నివారణ పూజలు.. ఇలా రకరకాల కార్యక్రమాలు చేయించడానికి భక్తులు అర్చకులను పిలుస్తూనే ఉంటారు. జీతభత్యాలతోపాటు.. ఏడాది పొడుగునా జరిగే ఇలాంటి కార్యక్రమాల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. అర్చకుడు ఒకసారి చేసిన పూజ బాగా నచ్చితే మరో అర్చకుడి వద్దకు భక్తులు వెళ్లరు. అదే అర్చకుడిని పదేపదే కోరతారు.
సూపర్ సంభావనలు
మంచి కంఠంతో చక్కటి ఉచ్చారణతో పూజాకార్యక్రమాలు చేయించే పురోహితులు, అర్చకులకు ప్రత్యేకంగా డిమాండ్ ఉంది. వారి సంభావనలు కూడా భారీగానే ఇస్తారు. ఉదాహరణకు.. డాల్‌సలో ముహూర్తాల సీజన్ కాని మామూలు రోజుల్లోనే సత్యనారాయణ వ్రతానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా సంభావన ఇస్తున్నారు. అదే ముహూర్తాల సీజన్‌లో అయితే.. రూ.30 వేల నుంచి రూ.45 వేల దాకా దక్షిణగా తీసుకుంటున్నారు. పక్కాగా ప్రణాళికతో వ్యవహరించే పురోహితులైతే రోజుకు ఒకటి కన్నా ఎక్కువ వ్రతాలు చేయించగలరు. ఇలా వారి ఆదాయం నెలకు సుమారు రూ.4 లక్షల నుంచి కొన్ని సందర్భాల్లో రూ.10 లక్షల దాకా కూడ ఉంటోందంటే అతిశయోక్తి కాదు. ఆర్-1 వీసాపై వచ్చి అమెరికాలో ఆలయంలో అర్చకులుగా పనిచేసేవారు.. భక్తుల ఇళ్లకు వెళ్లి వారింట్లో ఏవైనా కార్యక్రమాలు చేయించాలంటే, అందుకు గుడికి నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటికొచ్చి పూజ చేసినందుకు అర్చకులకు ఇచ్చేది అదనం.
ఇతర వీసాలపై వచ్చి కూడా..
ఆర్-1 వీసాపై వృత్తి రీత్యా వచ్చేవారే కాదు.. వేరే వీసాలపై వచ్చి పార్ట్‌టైమ్‌గా అర్చకత్వం చేసేవారు కూడా ఉన్నారు. కొందరు భక్తులు.. తమ ఇంటి పురోహితుణ్ని ప్రత్యేకంగా అమెరికాకు తీసుకొచ్చి కావాల్సిన పూజలు చేయించుకుని పంపేస్తారు. వీరిని పర్యాటక పురోహితులు అనొచ్చు. ఐటీ ఉద్యోగం చేసేవారిలో కొందరు.. ఖాళీ సమయంలో పూజలు చేయిస్తున్నారు. కొందరు రిమోట్‌గా ఉద్యోగం చేస్తూనే... పూర్తిస్థాయిలో అర్చకత్వంలో ఉన్నారు. పురోహితులకు కొరత ఉన్నచోట కొందరు యూట్యూబ్‌లో మంత్రాలు, శ్లోకాలు నేర్చుకుని పూజలు చేయిస్తున్నారు. అమెరికాకు విద్యాభ్యాసం కోసం వచ్చి ఓపీటీపై ఉన్న విద్యార్థుల్లో కొందరు సైతం.. అర్చకులకు ఉన్న డిమాండ్ చూసి పెద్దల సహకారంతో ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వేరేవ ేరే ఉద్యోగాలు చేసేవారిలో కొందరు.. తమకు ఖాళీగా ఉండే వారాంతాల్లో పూజలు చేయిస్తున్నారు.