Share News

Piyush Goyal: తల మీద తుపాకీ పెడితే..ఒప్పందాలు కుదుర్చుకోం

ABN , Publish Date - Oct 25 , 2025 | 03:51 AM

అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సహా పలు దేశాలు, ప్రాంతాలతో వాణిజ్య ఒప్పందాలపై భారత్‌ చురుగ్గా చర్చలు జరుపుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

Piyush Goyal: తల మీద తుపాకీ పెడితే..ఒప్పందాలు కుదుర్చుకోం

  • భారత్‌ తొందరపడి నిర్ణయాలు తీసుకోదు

  • వాణిజ్య ఒప్పందాలు దీర్ఘకాలిక దృక్పథంతో ఉండాలి.. కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నాం

  • జర్మనీలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

బెర్లిన్‌/న్యూఢిల్లీ, అక్టోబరు 24: అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సహా పలు దేశాలు, ప్రాంతాలతో వాణిజ్య ఒప్పందాలపై భారత్‌ చురుగ్గా చర్చలు జరుపుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. తొందరపాటుతో లేదా తలకు తుపాకీ పెట్టడంతో భారత్‌ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోబోదని ఆయన శుక్రవారం కరాఖండీగా చెప్పేశారు. ‘‘మేము ఈయూతో చురుగ్గా చర్చలు జరుపుతున్నాం. అమెరికాతోనూ మాట్లాడుతున్నాం. మేము తొందరపడి ఒప్పందాలు కుదుర్చుకోం. గడువులతో లేదా తలకు తుపాకీ పెట్టడంతో ఒప్పందాలు చేసుకోబోం’’ అని జర్మనీలో జరిగిన బెర్లిన్‌ గ్లోబల్‌ డైలాగ్‌ ఆయన పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచే మార్గాల గురించి చర్చించడానికి నాయకులు, బెర్లిన్‌ వ్యాపారుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి బెర్లిన్‌కు వెళ్లారు. అధిక సుంకాలను ఎదుర్కోవడంలో భాగంగా భారత్‌ కొత్త మార్కెట్లపై దృష్టిసారిస్తోందని గోయల్‌ చెప్పారు. ఒక దేశం నుంచి ఒక నిర్దిష్ట ఉత్పత్తిని కొనుగోలు చేయాలనే నిర్ణయాన్ని మొత్తం ప్రపంచం తీసుకోవాలన్నారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడాన్ని ఆపాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీయూష్‌ గోయల్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - Oct 25 , 2025 | 03:51 AM