International Relations: గాజాలో ఎట్టకేలకు శాంతి గీతం
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:20 AM
పశ్చిమాసియాలో శాంతి కపోతం ఎగిరింది.
పరస్పరం బందీలను విడుదల చేసిన హమాస్, ఇజ్రాయెల్
హమాస్ చెర నుంచి విడుదలైన ఓ ఇజ్రాయెలీ ఆనందం; ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదలైన పాలస్తీనా వాసులు
20 మంది ఇజ్రాయెలీలను రెడ్‌క్రా్‌సకు అప్పగించిన హమాస్
1,968 మంది పాలస్తీనీయులను విడుదల చేసిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ట్రంప్‌కు అపూర్వ స్వాగతం
గాజాలో యుద్ధం ముగిసింది: ట్రంప్ ప్రకటన
శాంతికి కట్టుబడతా: నెతన్యాహు.. ట్రంప్‌కు హమాస్ కృతజ్ఞతలు
ట్రంప్‌కు ఇజ్రాయెల్, ఈజిప్ట్ అత్యున్నత పురస్కారాలు
200ు టారి్‌ఫలు వేస్తానని బెదిరించి భారత్-పాక్ యుద్ధం ఆపా
పాక్-అఫ్ఘానిస్థాన్ యుద్ధాన్ని కూడా ఆపుతా: ట్రంప్
గాజా రెండోదశ శాంతి ఒప్పందంపై ఈజిప్టులో సంతకాలు
దేర్ అల్‌బలా(గాజా)/టెల్ అవీవ్/జేరుసలేం, అక్టోబరు 13: పశ్చిమాసియాలో శాంతి కపోతం ఎగిరింది. ఇజ్రాయెల్ దాడులతో రెండేళ్లుగా అతలాకుతలమైన గాజాలో ప్రశాంతత నెలకొనేందుకు మార్గం సుగమమైంది. ట్రంప్ శాంతి ప్రణాళిక అమల్లో భాగంగా తొలిదశ కింద సోమవారం ఇరుపక్షాలు బందీలను విడుదల చేశాయి. హమాస్ తమ వద్ద బందీలుగా
ఉన్న 20 మందిని గాజాలోని మూడు ప్రాంతాల్లో రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించగా.. ఆ సంస్థ వారిని ఇజ్రాయెల్‌కు తరలించింది. మరో 28 మంది బందీలు చనిపోవడంతో వారి మృతదేహాలను అప్పగించేందుకు హమాస్ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ తమ వద్ద బందీలుగా ఉన్న 19 వందలకుపైగా పాలస్తీనా ఖైదీల విడుదల ప్రక్రియ ప్రారంభించింది. ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న వెస్ట్‌బ్యాంక్‌లోని పలు జైళ్ల నుంచి సోమవారం రాత్రివరకు 1968 మందిని విడుదల చేసింది. గాజా ప్రాంతంలో ఆకలితో అల్లాడుతున్న ప్రజలకు సోమవారం నుంచే పూర్తిస్థాయిలో మానవతాసాయం అందించేందుకు అనుమతించింది. ఒప్పందం మేరకు గాజాలోని పలు ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించింది. తమవారు విడుదలవుతుండటంతో ఇజ్రాయెల్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.పాలస్తీనీయులు మానవతాసాయం కింద ఆహారం, మందులు అందబోతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడ చూసినా మృతదేహాలే..
ఇజ్రాయెల్ సైన్యం వైదొలుగుతున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లోకి పాలస్తీనీయులు తిరిగి ప్రవేశిస్తున్నారు. ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, శిథిలాలతో ఆ ప్రాంతాలు దారుణంగా కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ మొదలైన నాలుగు రోజుల్లోనే గాజాలోని సంక్షుభిత ప్రాంతాల్లో 200 మృతదేహాలను వెలికితీశామని.. ఇంకా పెద్ద సంఖ్యలో మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయని గాజా ఆరోగ్య విభాగం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య 67,800కు చేరిందని, అందులో సగం మందికిపైగా మహిళలు, చిన్నారులేనని పేర్కొంది. కాగా, శాంతి ఒప్పందంతో గాజాలోని పాలస్తీనియులకు తిరిగి స్వేచ్ఛ వచ్చిందని, చెల్లాచెదురైన వారంతా తమ కుటుంబాలను కలుసుకుంటారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ఇక గాజాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన కృషి అమోఘమని ప్రధాని మోదీ కితాబిచ్చారు. ఇజ్రాయెల్, హమా్‌సల నుంచి బందీల విడుదలపై హర్షం వ్యక్తం చేశారు.
గాజాలో యుద్ధం ముగిసింది: ట్రంప్
శాంతి ఒప్పందం, ఇతర అంశాలపై ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ దేశ చట్టసభ కెనెసెట్‌లో ప్రసంగించారు. ఆయన సభలోకి రాగానే ఇజ్రాయెల్ ఎంపీలంతా లేచి నిలబడి రెండున్నర నిమిషాల పాటు కరతాళధ్వనులు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘యుద్ధాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు శాంతి నెలకొల్పే సమయం. గాజాలో యుద్ధం ముగిసింది. ఉగ్రవాదంపై మీరు (ఇజ్రాయెల్) విజయం సాధించారు. ఆ విజయాన్ని శాంతిగా మలుచుకునే సమయం ఇది. భవిష్యత్తు తరాలు ఈ రోజును గుర్తు చేసుకుంటాయి..’’ అని పేర్కొన్నారు. గాజా పునర్నిర్మాణానికి సాయం చేస్తామని.. పాలస్తీనీయులు ఉగ్రవాదం, హింసను వీడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. శాంతిని నెలకొల్పడానికి తాను కట్టుబడి ఉంటానని, రెండేళ్ల యుద్ధం ముగిసిందని చెప్పారు. అమెరికా అధ్యక్షుల్లో అందరికన్నా ట్రంప్ ఇజ్రాయెల్‌కు గొప్ప స్నేహితుడని అభివర్ణించారు. గాజాలో యుద్ధం ముగిసిపోయిందన్న ట్రంప్ వ్యాఖ్యలపై హమాస్ హర్షం వ్యక్తం చేసింది.
ట్రంప్‌కు ఇజ్రాయెల్,
ఈజిప్ట్ అత్యున్నత పురస్కారాలు
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన కృషికి గుర్తింపుగా ట్రంప్‌కు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్’ పురస్కారం అందజేయనున్నట్టు ఇజ్రాయెల్.. ‘ది ఆర్డర్ ఆఫ్ ది నైల్’ పురస్కారాన్ని అందజేయనున్నట్టు ఈజిప్ట్ ప్రకటించాయి.
ట్రంప్‌కు బంగారు పావురాన్ని బహూకరిస్తున్న నెతన్యాహు
200శాతం టారి్‌ఫలు వేస్తానని బెదిరించి
భారత్-పాక్ యుద్ధం ఆపా: ట్రంప్
గాజా శాంతి ఒప్పందంతో కలిపి ఇప్పటివరకు 8 యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పారు. వాటిలో చాలా వరకు తాను కల్పించుకున్న ఒక్కరోజులోనే నిలిపివేశానన్నారు. ఇజ్రాయెల్ నుంచి ఈజి్‌ప్టకు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పారు. ‘‘మీవద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. మీరు యుద్ధం కొనసాగించాలనుకుంటున్నారా? అని అడిగా.. అలా అయితే మీపై వంద శాతం, 150 శాతం, 200శాతం టారి్‌ఫలు విధిస్తానని హెచ్చరించా. 24 గంటల్లో సమస్యను పరిష్కరించా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం పాక్-అఫ్ఘానిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతోందని తన దృష్టికి వచ్చిందని, దాన్ని కూడా తాను ఆపేయిస్తానని ట్రంప్ చెప్పారు. తాను నోబెల్ శాంతి బహుమతి కోసం ఇదంతా చేయడం లేదని, ప్రజల ప్రణాలు కాపాడేందుకే చేస్తున్నానని చెప్పారు. అయినా ఇటీవల ఇచ్చిన నోబెల్ 2024 ఏడాదికి సంబంధించి చేసిన ఎంపిక అని, తాను యుద్ధాలను ఆపినది 2025లోనని పేర్కొన్నారు.