Launches Air Strikes: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:01 AM
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ మరో రెండు రోజుల పాటు....
పక్తికా ప్రావిన్స్‌లో బాంబుల వర్షం
ప్రతీకారం తీర్చుకుంటామన్న అఫ్గాన్
కాబూల్/ఇస్లామాబాద్, అక్టోబరు 17: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ మరో రెండు రోజుల పాటు పొడిగించిన కాసేపటికే అఫ్గాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో పాక్ బాంబుల వర్షం కురిపించింది. తమ భూభాగంలోని మూడు ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులు జరిపిందని నిర్ధారించిన తాలిబన్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. దాడుల్లో ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే తాలిబన్ ఫైటర్లు పెద్ద సంఖ్యలో సరిహద్దుకు తరలి వెళ్లారు. దీనికి తోడు తాలిబన్ రక్షణ శాఖ 400 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం గల క్షిపణి పరీక్ష నిర్వహించిందని కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలో దోహాలో శాంతి చర్చలు జరిపేందుకు ఖతార్ ముందుకు వచ్చినట్లు సమాచారం.
ఆత్మాహుతితో పాక్ ఆర్మీ ఉలికిపాటు
ఖైబర్ ఫఖ్తుంక్వాలోని ఉత్తర వజీరిస్థాన్‌కు చెందిన మిర్ అలీ పాక్ మిలిటరీ క్యాంప్‌పై తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి కారుబాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పాక్ సైనికులతో పాటు మరో 13 మంది మృతిచెందారు. దాడికి పాల్పడిన నలుగురు టీటీపీ ఉగ్రవాదులను మట్టుబెట్టామని పాక్ ఆర్మీ ప్రకటించింది. మరోవైపు పాక్‌లో ఉన్న మరో 28 అఫ్గాన్ శరణార్థుల శిబిరాలను మూసివేశారు. శరణార్థులంతా తక్షణమే అఫ్గాన్‌కు వెళ్లిపోవాలని పాక్ అధికారులు ఆదేశించారు. ఇప్పటివరకు 14 లక్షల మంది శరణార్థులను అఫ్గాన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ద్విముఖ యుద్ధానికి పాక్ సిద్ధం
పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ అఫ్గాన్‌తో పాటు భారత్‌తో కూడా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడితే ఏకకాలంలో ద్విముఖ యుద్ధం చేసేందుకు సిద్ధమన్నారు. ఈ నెల 11న ఖైబర్ ఫఖ్తుంక్వా, బలోచిస్తాన్ సరిహద్దు వెంబడి 58మంది పాకిస్థానీ సైనికులను హతమార్చడంతో పాటు 20 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశామని అఫ్గాన్ వెల్లడించింది. పాకిస్థాన్ కూడా తాము 200 మంది తాలిబన్లను మట్టుబెట్టామని, ఘర్షణలో తమ సైనికులు 23 మంది మృతిచెందారని అంగీకరించింది.