Share News

Pakistan Hides Warships: బెంబేలెత్తి యుద్ధనౌకలను దాచిన పాక్‌

ABN , Publish Date - Aug 19 , 2025 | 02:27 AM

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ విరుచుకుపడుతున్న సమయంలో పాకిస్థాన్‌ బెంబేలెత్తి దాక్కున్న సంగతి తాజాగా రుజువులతో సహా బయటపడింది. ...

Pakistan Hides Warships: బెంబేలెత్తి యుద్ధనౌకలను దాచిన పాక్‌

  • ఆపరేషన్‌ సిందూర్‌ వేళ దాయాది పిరికిచర్య

  • వాణిజ్యపోర్టులకు యుద్ధనౌకల తరలింపు

  • సరుకురవాణా నౌకల మధ్య దాచిన వైనం

  • ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడి

  • యుద్ధ సమయంలో బోసిపోయిన పాక్‌ నౌకాదళ కరాచీ స్థావరం

  • గ్వదార్‌ పోర్టుకు పలు యుద్ధనౌకలు

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ విరుచుకుపడుతున్న సమయంలో పాకిస్థాన్‌ బెంబేలెత్తి దాక్కున్న సంగతి తాజాగా రుజువులతో సహా బయటపడింది. భారత్‌ క్షిపణులు ప్రయోగిస్తుందేమోనన్న భయంతో పాకిస్థాన్‌ తన నౌకాదళానికి చెందిన ప్రధానమైన, అత్యాధునిక యుద్ధనౌకలను నౌకాదళ స్థావరాల నుంచి తరలించి, వాణిజ్య నౌకలను నిలిపే పోర్టులకు తరలించింది. ఆ విధంగా ఆ వాణిజ్య నౌకల మధ్య వాటిని దాచి పెట్టింది. ఈ వివరాలు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడైందని ఇంగ్లిష్‌ చానల్‌ ఇండియాటుడే తెలిపింది. పాకిస్థాన్‌లోని కరాచీ, గ్వదార్‌ పోర్టుల తాలూకు ఉపగ్రహ చిత్రాలను ఈ ఛానల్‌కు చెందిన ‘ఒపెన్‌సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌’ విశ్లేషించింది. చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో కీలకమైన గ్వదార్‌ వాణిజ్య పోర్టులో వాణిజ్య నౌకల మధ్య పలు యుద్ధనౌకలున్నట్లు తేలింది. వీటిలో పాక్‌ ఎంతో ఘనంగా చెప్పుకొనే జుల్ఫికర్‌ క్లాస్‌ నౌకలు రెండు, పాక్‌లో అతిపెద్ద యుద్ధనౌకలుగా పేరొందిన తుఘ్రిల్‌ క్లాస్‌ నౌకలు రెండు, అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఏకైక యుద్ధనౌక ఒలివర్‌ హజార్డ్‌ పెర్రీ క్లాస్‌ నౌక, రెండు తీరప్రాంత గస్తీ నౌకలు ఉన్నాయని తెలిసింది. ఇరాన్‌ సరిహద్దులకు కేవలం 100 కి.మీ.ల దూరంలో ఉన్న గ్వదార్‌ పోర్టు ఈ విధంగా.. యుద్ధవేళ పాక్‌ నౌకాదళానికి తాత్కాలిక ఆశ్రయంగా మారటం విశేషం. ఇక కరాచీలోని పాకిస్థాన్‌ నౌకాదళ స్థావరం కూడా ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో బోసిపోయి కనిపించింది. అక్కడ ఉండాల్సిన యుద్ధనౌకలు.. కరాచీ వాణిజ్య పోర్టులో ఓ సరుకు రవాణానౌక సమీపంలో ఉన్నాయి. ఆ సరుకు రవాణానౌకలో లోడింగ్‌/అన్‌లోడింగ్‌ ప్రక్రియ జరుగుతుండటం, అక్కడ పలు కంటెయినర్లు ఉండటం కూడా ఈ చిత్రాల్లో వెల్లడైంది. పీఎన్‌ఎ్‌స ఆలంగిర్‌తోపాటు మొత్తం నాలుగు యుద్ధనౌకలను, ఒక గస్తీ నౌకను ఇక్కడ దాచి పెట్టారు.


హడలెత్తించిన ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌ను అరేబియా సముద్రంలో మోహరించటం, కరాచీ పోర్టును ధ్వంసం చేయటానికి భారత్‌ సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలోనే.. పాక్‌ తన యుద్ధనౌకలను ఈ విధంగా దాచి పెట్టి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1971 యుద్ధవీరుడు, సదరన్‌ నావల్‌ కమాండ్‌ మాజీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ ఎస్సీ సురేష్‌ బంగారా మాట్లాడుతూ, మన త్రివిధ దళాలు అత్యంత కచ్చితమైన సమన్వయంతో వ్యవహరించటం వల్ల, సముద్రం నుంచి ఒక్క క్షిపణిని కూడా ప్రయోగించకుండానే ఆశించిన లక్ష్యాలన్నింటినీ సాధించామని విశ్లేషించారు. ఆపరేషన్‌ సిందూర్‌ వేళ పాక్‌ తన యుద్ధవిమానాలను కూడా పౌరవిమానాలకు సమీపంలో నడిపించిందన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 02:27 AM