Operation Sindoor: భారత్ కాల్పుల విరమణపై పాక్ జర్నలిస్ట్ విమర్శలు.. అమెరికా అధికారి ఏమన్నారంటే
ABN , Publish Date - May 14 , 2025 | 04:49 PM
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం తప్పదనుకునే దశంలో రంగప్రవేశం చేసిన అమెరికా కాల్పుల విరమణకు ఇరు దేశాలను ఒప్పించింది. కాల్పుల విరమణకు భారత్, పాక్‌లను ఒప్పించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు.
పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రశిబిరాలపై దాడి చేసింది. అందుకు ప్రతిగా పాకిస్థాన్ కూడా కాల్పులు ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. యుద్ధం తప్పదనుకునే దశలో రంగప్రవేశం చేసిన అమెరికా (America) కాల్పుల విరమణకు ఇరు దేశాలను ఒప్పించింది. కాల్పుల విరమణకు (Ceasefire) భారత్, పాక్‌లను ఒప్పించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రకటించుకున్నారు.
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా చేసిన కృషిని పాకిస్థాన్ ప్రశంసించింది. అయితే భారత్ మాత్రం ఇప్పటివరకు అటు ట్రంప్ పేరును, ఇటు అమెరికా రాయభారాన్ని ప్రశంసించలేదు. దీంతో కాల్పుల విరమణను భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకించారని వార్తలు మొదలయ్యాయి. మంగళవారం అమెరికా విదేశాంగ శాఖ సమావేశంలో పాక్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ ఇదే ప్రశ్న అడిగాడు. శాంతి ఒప్పందాన్ని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించలేకపోవడం మిమ్మల్ని నిరాశకు గురి చేస్తోందా అని అడిగాడు.
అమెరికా విదేశాంగ శాఖ ప్రధాన డిప్యూటీ ప్రతినిధి టామీ పిగోట్ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తమ మొదటి ప్రాధాన్యం కాల్పుల విరమణ మాత్రమేనని, రెండు దేశాల మధ్య పరస్పర చర్చలపై మాత్రమే దృష్టి సారిస్తున్నామని, ఊహాగానాలపై దృష్టి పెట్టడం లేదని చెప్పారు. అలాగే సదరు జర్నలిస్ట్.. పాకిస్థాన్‌పై భారత్ ఉపయోగించిన ఆయుధాలు ఇజ్రాయేల్‌కు చెందినవని, ఈ చర్య వల్ల ఇజ్రాయేల్, పాకిస్థాన్ మధ్య దూరం మరింత పెరుగుతుందా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కూడా పిగోట్ స్పందిస్తూ తాము దేనిపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నామో తమకు తెలుసని, అనవసర విషయాలను ఇప్పుడు పట్టించుకోలేమని అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..