Share News

Donald Trump: ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి అంబానీ దంపతులు

ABN , Publish Date - Jan 19 , 2025 | 03:40 AM

అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ హాజరు కానున్నారు.

 Donald Trump: ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి అంబానీ దంపతులు

భారత్‌ తరఫున కేంద్ర మంత్రి జైశంకర్‌

న్యూఢిల్లీ, జనవరి 18: అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి రిలయన్స్‌ గ్రూప్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ హాజరు కానున్నారు. దీనికోసం వీరు శనివారం (18న) వాషింగ్టన్‌ డీసీకి చేరుకుంటారు. వర్జీనియాలోని ట్రంప్‌ నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో రిసెప్షన్‌, బాణసంచా ప్రదర్శనతో ముందస్తు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా క్యాబినెట్‌ రిసెప్షన్‌, ఉపాధ్యక్షుడి ప్రత్యేక విందులో కీలక రాజకీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖులతో కలిసి అంబానీ దంపతులు పాల్గొంటారు. ట్రంప్‌, జేడీ వాన్స్‌, ఉషా వాన్స్‌ సమక్షంలో జరిగే క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌కు కూడా వీరు హాజరవుతారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందుకున్న ప్రముఖుల జాబితాలో ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌ సహా పలువురు అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలు, టెక్‌ ప్రముఖులు ఉన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, జపాన్‌ విదేశాంగ మంత్రి తకేషీ ఇవాయా ఈ వేడుకలో పాల్గొంటారు. ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఎముకలు కొరికే చలి వాతావరణం నేపథ్యంలో క్యాపిటల్‌ భవనంలోని రోటుండా లోపల వెచ్చటి వాతావరణంలో ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చివరిసారిగా 1985 జనవరి 20న రోనాల్డ్‌ రీగన్‌ ప్రమాణ స్వీకారం చలి తీవ్రత కారణంగా క్యాపిటల్‌ భవనంలో జరిగింది.

Updated Date - Jan 19 , 2025 | 03:40 AM