Donald Trump: ట్రంప్ పిచ్చోడు
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:42 AM
అమెరికాలో ట్రంప్ మరియు మస్క్ విధానాలపై వ్యతిరేకంగా 'హ్యాండ్సాఫ్' పేరుతో లక్షల మంది ప్రజలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వలస విధానాలు, ధరల పెరుగుదల, ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపులను వ్యతిరేకిస్తూ ఈ నిరసనలు 50 రాష్ట్రాల్లోని 1200 నగరాల్లో శాంతియుతంగా జరిగాయి.

యూర్‌పలోనూ నిరసనల హోరు
నిప్పులు చెరిగిన అమెరికన్లు
ట్రంప్, మస్క్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు
రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు.. ‘హ్యాండ్సాఫ్’ పేరిట వరదలా వీధుల్లోకి
ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్ప కాలంలోనే నిరసన ర్యాలీలు, ధర్నాలు
నిరసనలతో ఒరిగేదేం లేదు.. వైట్‌హౌస్ స్పష్టీకరణ
ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు.. బ్రిటన్ ప్రభుత్వ అంచనా
వాషింగ్టన్, ఏప్రిల్ 6: అమెరికన్లు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా నడిరోడ్లపైకి వచ్చి.. హ్యాండ్సా్‌ఫ(జోక్యం వద్దు) పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ‘పిచ్చోడు’ అంటూ గేలిచేశారు. ట్రంప్‌తోపాటు డోజ్ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు.. వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం ఇలా.. అనేక పరిణామాలను నిరసిస్తూ.. లక్షలాది మంది శనివారం రోడ్డెక్కారు. వాస్తవానికి ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టారు. అయితే.. అత్యంత స్వల్ప కాలంలోనే ఆయనకు వ్యతిరేకంగా అమెరికా పౌరులు ఆందోళనకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. లాస్‌ఏంజెలెస్, బోస్టన్, న్యూయార్క్, హ్యూస్టన్, కొలొరాడో, ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ తదితర రాష్ట్రాల్లో సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ‘‘కుబేరుల అజెండాను అమలు చేస్తున్నారు. అధికార అతిక్రమణలకు పాల్పడుతున్నారు’’ అంటూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలు వామపక్ష నేతల ఆధ్వర్యంలో చేపట్టినట్టు స్థానిక మీడియా పేర్కొంది. గార్డియన్ మీడియా కథనం మేరకు.. వాషింగ్టన్, ఫ్లోరిడా సహా పలు రాష్ట్రాల్లో చేపట్టిన నిరసనల్లో 5 లక్షల మంది అంతకుపైగానే.. పౌరులు పాల్గొన్నారు. మొత్తంగా 50 రాష్ట్రాల్లోని 12 వందల నగరాల్లో ‘హ్యాండ్సాఫ్’ పేరిట నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలన్నీ శాంతియుతంగానే జరిగాయని.. ఎక్కడా ఎవరినీ అరెస్టు చేయలేదని గార్డియన్ పేర్కొంది.
మస్క్ పాలసీలకు మద్దతిస్తూ ట్రంప్ కుబేరుల అజెండాను అమలు చేస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నారని, వలసలు, మానవహక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారని గర్జించారు. అయితే, ఈ ఆందోళనల్లో అమెరికాలోని వలసదారులెవరూ పాల్గొనలేదు. నిరసన ప్రదర్శనల్లో, అమెరికా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో వలసదారులెవరైనా పాల్గొంటే వారిని బహిష్కరిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించడమే ఇందుకు కారణం.
‘రాజ్యాధిపత్యంపై పోరాటం’
‘రాజ్యాధిపత్యంపై పోరాటం’ అని రాసి ఉన్న ప్లకార్డులు సీటెల్ సహా.. పలు రాష్ట్రాల్లో కనిపించాయి. అంతేకాదు.. కొన్ని చోట్ల ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశ జాతీయ పతాకాన్ని పట్టుకుని నిరసన కారులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ‘హ్యాండ్సాఫ్ కెనడా, హ్యాండ్సాఫ్ గ్రీన్‌ల్యాండ్, హ్యాండ్సాఫ్ ఉక్రెయిన్’ నినాదాలతో నిరసనకారులు హోరెత్తించారు. ‘‘ట్రంప్‌కు కీలక సందేశం పంపించేందుకే హ్యాండ్సాఫ్ ఉద్యమం చేపట్టాం’’ అని అమెరికా రాజకీయ నేత లీహ్ గ్రీన్‌బర్గ్ చెప్పారు. ట్రంప్‌పై నిరసన కారులు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆయన పేరును ప్రస్తావించకుండానే ‘శ్వేతజాతి అత్యాచార నిందితులు’ అంటూ నిప్పులు చెరిగారు. ‘‘నాకు చాలా కోపంగా ఉంది. మనసు రగిలిపోతోంది. శ్వేతజాతి అత్యాచార నిందితులు మన దేశాన్ని నియంత్రిస్తున్నారు’’ అని 43 ఏళ్ల షైనా కేస్నెర్ నిప్పులు చెరిగారు. చాలా మంది ‘‘అమెరికాకు రాజు ఎవరూ లేడు’’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
బెర్లిన్‌లో టెస్లా షోరూం ముందు...
ట్రంప్, మస్క్‌కు వ్యతిరేకంగా పలు యూరోపియన్ నగరాల్లోనూ శనివారం వందలాది మంది నిరసన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారి్‌సలో దాదాపు 200 మంది ఆందోళనకు దిగారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ‘హ్యాండ్సాఫ్’ ప్రదర్శనను నిర్వహించారు. ట్రంప్ రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. బెర్లిన్‌లోని టెస్లా కార్ల షోరూం ముందు నిరసన తెలిపారు. అలాగే లండన్, లిస్బన్ నగరాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
నిరసనలతో ఒరిగేది లేదు!
ట్రంప్, మస్క్ విధానాలను ఎండగడుతూ లక్షల మంది ప్రజలు నిరసన చేపట్టిన నేపథ్యంలో అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నిరసనలు చేపట్టినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేసింది. ట్రంప్ ప్రజాదరణ కూడా ఏమాత్రం తగ్గబోదని పేర్కొంది. కాగా.. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. ‘‘నా విధానాల్లో ఎలాంటి మార్పూ ఉండబోదు’’ అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి
Read Latest and International News