Mark Carney: కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:26 AM
కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ ఎంపికయ్యారు. ప్రస్తుత ప్రధాని ట్రూడో జనవరిలో తన రాజీనామాపై ప్రకటన చేశాక.. వారసత్వ ఎంపిక జరిగేదాకా ఆ పదవిలో కొనసాగుతానని పేర్కొన్న విషయం తెలిసిందే..

85.9% ఓట్లతో ఎన్నుకున్న లిబరల్ పార్టీ
అమెరికా విషయంలో తగ్గేదేలేదన్న మార్క్
ఒట్టావా, మార్చి 10: కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ ఎంపికయ్యారు. ప్రస్తుత ప్రధాని ట్రూడో జనవరిలో తన రాజీనామాపై ప్రకటన చేశాక.. వారసత్వ ఎంపిక జరిగేదాకా ఆ పదవిలో కొనసాగుతానని పేర్కొన్న విషయం తెలిసిందే..! అధికార లిబరల్ పార్టీ తదుపరి ప్రధాని కోసం ఆదివారం జరిపిన ఎన్నికల్లో.. మార్క్‌కు 1.31 లక్షల ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇవి 85.9ు. దాంతో.. కెనడా 24వ ప్రధానిగా మార్క్ పేరు ఖరారైంది. తొమ్మిదేళ్ల ట్రూడో పాలన ముగిసింది. ఈ పోటీలో మార్క్ ప్రత్యర్థులు కరీనా గౌల్డ్, ఫ్రాంక్ బేలిస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మార్క్‌కు ఆర్థిక రంగంలో అపారమైన అనుభవం ఉంది. మార్క్ కార్నీ హార్వర్డ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. 2008-13 మధ్యకాలంలో కెనడా సెంట్రల్ బ్యాంక్‌కు గవర్నర్‌గా సేవలందించారు. 2013-20 కాలంలో ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంక్‌కు గవర్నర్‌గా పనిచేశారు. గత ఏడాది నుంచి ఆయన లిబరల్ పార్టీకి ఆర్థిక సలహాదారుగా కొనసాగుతున్నారు. ట్రూడో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించాక.. అనూహ్యంగా ప్రధాని అభ్యర్థి బరిలో నిలిచారు. ఈయనకు హాకీ, రగ్బీ క్రీడల్లో ప్రవేశముంది.
అమెరికాపై కెనడాదే పైచేయి
ప్రధానిగా తన ఎంపిక లాంఛనమవ్వగానే.. లిబరల్ పార్టీ కన్వెన్షన్‌లో ప్రజలనుద్దేశించి మార్క్ ప్రసంగిస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై మండిపడ్డారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామంటూ ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనలపై తీవ్రంగా స్పందించారు. ‘‘కెనడా ఎన్నటికీ అమెరికాలో భాగం కాబోదు. మేం ఏ విధంగానూ.. ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాదు. మా దేశం అప్పటికీ, ఇప్పటికీ బలంగా ఉంది. వాణిజ్యమే అయినా.. హాకీ లాంటి క్రీడలే అయినా.. అమెరికాపై కెనడాదే విజయం’’ అని వ్యాఖ్యానించారు. కెనడాలో ఉన్న అపార వనరులు, నీరు, భూమిని స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో అమెరికా ఉందని, ఒకవేళ అదే జరిగితే.. మన(కెనడా) జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్‌తో మైత్రి దిశగా..
భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తానని మార్క్ గత వారమే ప్రకటించారు. ‘‘నేను కెనడా ప్రధానినైతే.. భారత్‌తో క్షీణించిన దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తాను. భారత్‌తోనే కాదు.. ఇండియాతో సారూప్యత ఉన్న దేశాలతోనూ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటాను’’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఖలిస్థానీ నేత హర్దీ్‌పసింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెన్సీల హస్తముందని అప్పట్లో ట్రూడో ఆరోపించడం.. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించడం తెలిసిందే..! ఆ తర్వాత ఇరుదేశాల మధ్య దూరం పెరిగింది.