Share News

Israel-Doha: హమాస్‌ నాయకత్వమే టార్గెట్.. దోహాపై ఇజ్రాయెల్ గగనతల దాడి

ABN , Publish Date - Sep 09 , 2025 | 09:55 PM

దోహాలోని హమాస్ స్థావరాన్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ మిలిటరీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులను ఖతర్ ఖండించింది. ఇది పిరికిపంద చర్య అంటూ మండిపడింది. గాజాలో కాల్పుల విరమణ చర్చలపై ఈ దాడులు ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు కామెంట్ చేస్తున్నారు.

Israel-Doha: హమాస్‌ నాయకత్వమే టార్గెట్.. దోహాపై ఇజ్రాయెల్ గగనతల దాడి
Doha explosions

ఇంటర్నెట్ డెస్క్: ఖతర్‌ రాజధాని దోహాలో పలు చోట్ల పేలుళ్లు జరగడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో హమాస్‌ సీనియర్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ కచ్చితత్వంతో దాడులు చేశామని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించడం సంచలనానికి దారి తీసింది (Israel Hamas strike).

తాము టార్గెట్ చేసిన హమాస్ నాయకత్వం అక్టోబర్ 7 నాటి మారణహోమానికి ప్రత్యక్షంగా కారణమని ఇజ్రాయెల్ మిలిటరీ తన ప్రకటనలో తెలిపింది. ఇప్పటికీ ఇజ్రాయెల్‌పై వారు దాడులు కొనసాగిస్తున్నారని పేర్కొంది (Doha explosions,).

కాగా, దోహాలో దాడులు చేసినట్టు ఇజ్రాయెల్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హమాస్ ఉగ్రసంస్థ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ దాడులు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ దాడులకు ఆపరేషన్ సమ్మిట్ ఆఫ్ ఫైర్‌గా నామకరణం చేసినట్టు తెలిపారు. ఇవి వైమానిక దాడులని చెప్పారు. విదేశాల్లోని హమాస్ నాయకత్వాన్ని మట్టుపెడతామని ఇజ్రాయెల్ రక్షణ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


హమాస్‌కు చెందిన పలువురు కీలక నేతలు దోహాలో తలదాచుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇక హమాస్‌, ఇజ్రాయెల్ మధ్య గతంలో జరిగిన చర్చలకు ఖతర్ మధ్యవర్తిత్వం నెరపింది. తాజా దాడుల నేపథ్యంలో గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం మరింత జటిలంగా మారే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కాగా, ఈ దాడులను ఖతర్ ఖండించింది. ఇజ్రాయెల్ పిరికిపంద చర్యకు దిగిందని మండిపడింది. అంతర్జాతీయ చట్టాలు నిబంధనలను ఈ దాడి ఉల్లంఘించిందని ఖతర్ విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. ఈ దాడి తరువాత ఖతర్ దేశ భద్రతకు ప్రమాదం మరింత పెరిగిందని అన్నారు. కాగా, హమాస్‌ను టార్గెట్ చేసిన దాడి గురించి ఇజ్రాయెల్ తమకు ముందుగానే సమాచారం ఇచ్చిందని అమెరికా శ్వేత సౌధానికి చెందిన ఓ అధికారి తెలిపారు.

Updated Date - Sep 09 , 2025 | 10:03 PM