Iron Dome: ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ విఫలమైందా.. అసలేం జరుగుతోంది..
ABN , Publish Date - Jun 20 , 2025 | 01:56 PM
ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్‌లోని పలు కీలక భవనాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ విఫలమవుతోందా అన్న ప్రశ్న వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ పేరు చెబితే చాలా మందికి గుర్తొచ్చేది ఐరన్ డోమ్. ఈ గగనతల రక్షణ వ్యవస్థకు తిరుగేలేదన్న పేరు ఉంది (Israel Iron Dome Failure). గతంలో జరిగిన హమాస్ దాడులను అత్యంత కచ్చితత్వంతో తిప్పికొట్టడంతో ఈ వ్యవస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే, తాజా ఘర్షణల్లో ఇరాన్ దాడులను కూడా ఐరన్ డోమ్ తొలుత అద్భుతంగా అడ్డుకుంది. కానీ రెండు రోజుల క్రితం ఇరాన్ మిసైల్ దాడులకు ఇజ్రాయెల్‌లోని పలు కీలక కార్యాలయాలు, భవనాలు దెబ్బతిన్నాయి. దీంతో, ఐరన్ డోమ్ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది జనాలు ఊహించినంత శక్తిమంతం కాదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇజ్రాయెల్‌కు చెందిన రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అమిర్ అవీవీ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఐరన్ డోమ్‌పై ఒత్తిడి పెరిగిన మాట వాస్తవమే అయినా ఈ వ్యవస్థ మాత్రం ఇప్పటికీ శక్తిమంతంగానే ఉందని తెలిపారు. ఇరాన్ దాడులను ఐరన్ డోమ్‌తో పాటు యారో 3 మిసైల్స్ ద్వారా అడ్డుకుంటున్నామని చెప్పారు.
ఏ వ్యవస్థ అయినా 100 శాతం సామర్థ్యంతో పని చేయలేదని ఆయన అన్నారు. అందుకే, ఇజ్రాయెల్ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుందని గుర్తు చేశారు. శత్రు దేశ మిసైళ్లు ఒక దశను దాటుకుని లోపలికి వస్తే మిగిలిన వ్యవస్థలు క్రీయాశీలకమై వాటిని ధ్వంసం చేస్తాయని తెలిపారు. ఐరన్ డోమ్ శకం ముగిసిందా అన్న ప్రశ్నను కూడా ఆయన తోసిపుచ్చారు. ఈ వ్యవస్థ ఇప్పటికీ ఆశించిన స్థాయిలో ఇజ్రాయెల్‌కు రక్షణ ఇస్తోందని అన్నారు. అయితే, ఏదో ఒక వ్యవస్థతో పూర్తి రక్షణ లభించదని గుర్తు చేశారు. పలు అంచెల్లో బహుళ రక్షణ వ్యవస్థలు కలిసి పని చేస్తేనే శత్రుదేశ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలమని అన్నారు.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ సామర్థ్యం బాగా తగ్గిపోయిందని అన్నారు. 40 శాతం మిసైల్ లాంచర్లు ధ్వంసమయ్యాయని అన్నారు. మొదట్లో భారీ స్థాయిలో క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ ప్రస్తుతం ఆ స్థాయిలో దూకుడు కనబరచడం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో తాము నేరుగా జోక్యం చేసుకోవాలా వద్దా అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరి కొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని శ్వేత సౌధం గురువారం ప్రకటించింది. అయితే, అమెరికా జోక్యం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని రష్యా కూడా హెచ్చరించింది.
ఇవీ చదవండి:
తరిగిపోతున్న క్షిపణి నిల్వలు .. ఒత్తిడిలో ఇజ్రాయెల్
ఇరాన్‌పై దాడికి అమెరికా రెడీనా.. తేదీ ఖరారైనట్టేనా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి