Israel- Iran War: పశ్చిమాసియాలో గగనతలం మూసివేత
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:34 AM
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మరింత విస్తరిస్తుండడంతో పశ్చిమాసియాలో చాలా వరకు దేశాలు గగనతలాన్ని మూసివేశాయి.

నిలిచిపోయిన విమానాల రాకపోకలు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్
టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
టెల్‌అవీవ్‌లోని మొస్సాద్ హెడ్‌క్వార్టర్స్‌ను తాకిన ఇరాన్ క్షిపణి
టెల్‌అవీవ్/టెహ్రాన్/న్యూఢిల్లీ, జూన్ 17: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మరింత విస్తరిస్తుండడంతో పశ్చిమాసియాలో చాలా వరకు దేశాలు గగనతలాన్ని మూసివేశాయి. ఇరు దేశాల నుంచి బాలిస్టిక్ క్షిపణి దాడులు కొనసాగుతుండడంతో.. విమానాల రాకపోకలను నిలిపివేశాయి. దీంతో.. లెబనాన్, జోర్దాన్, ఇరాక్‌లో విమాన ప్రయాణాలు ఆగిపోయాయి. పశ్చిమాసియాలో దాదాపు 10 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయి ఉంటారని విశ్రాంత పైలట్, విమానయాన భద్రత నిపుణుడు జాన్ కాక్స్ పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ కూడా యుద్ధం ఆరంభం నుంచే విమానాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే..! అయితే.. విదేశాల్లో చిక్కుకుపోయిన 2 లక్షల మంది పౌరులను వెనక్కి రప్పించేందుకు బుధవారం నుంచి పరిమితంగా విమానాలను అనుమతిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల కారణంగా విదేశాల్లో ఉన్న 700 మంది ఇజ్రాయెలీ వైద్యులను సైప్రస్ నుంచి నౌకల ద్వారా స్వదేశానికి తీసుకువస్తోంది. దేశంలో చిక్కుకుపోయిన 1500 మంది విదేశీయులను నౌకల్లో తరలిస్తున్నట్లు తెలిపింది. కాగా.. ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రప్పించే ప్రయత్నం ప్రారంభమైనట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. తొలిరోజు 110 మంది విద్యార్థులను అర్మేనియా మీదుగా ఇరాన్ సరిహద్దు దాటించినట్లు పేర్కొంది. కాగా.. ఇరాన్‌లో సుమారు 10 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిని అర్మేనియాతోపాటు.. అజర్‌బైజాన్, తుర్కమెనిస్థాన్ మీదుగా భారత్‌కు రప్పిస్తామని విదేశాంగ శాఖ అధికారులు వివరించారు. ఇరాన్‌లోని భారతీయులు +98 9128109115, +98 9128109109 నంబర్లకు ఫోన్ ద్వారా, +98 901044557, +98 9015993320, +91 8086871709, +98 9177699036 నంబర్లకు వాట్సాప్ ద్వారా సంప్రదించాలని ఇరాన్‌లోని భారతీయులకు సూచించారు.
టెహ్రాన్‌పై వైమానిక దాడులు
ఇరాన్ గగనతలాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నామని సోమవారం ప్రకటించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) మంగళవారం తెల్లవారుజాము నుంచి వైమానిక దాడులను ప్రారంభించింది. ఇరాన్ వ్యాప్తంగా 200కు పైగా క్షిపణి లాంచర్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. తమ దాడుల్లో ఇరాన్ సైన్యానికి చెందిన ఖతమ్-అల్-అంబియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ జనరల్ అలీ షాద్మనీ చనిపోయినట్లు వెల్లడించింది. టెహ్రాన్ నుంచి ఇతర ప్రాంతాలకు ఇరానీల వలసలు పెరిగాయి. దీంతో.. పెట్రోల్ బంకులకు వాహనాలు పోటెత్తాయి. ‘‘టెహ్రాన్‌లోని పౌరులు వెంటనే నగరాన్ని ఖాళీ చేయాలి’’ అని అమెరికా అధ్యక్షుడు ఎక్స్‌లో హెచ్చరించడంతో.. పౌరులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కాగా.. ఇరాన్‌పై దాడికి వాడిన డ్రోన్లను తయారు చేసేందుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీని ధ్వంసం చేసినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది.