పౌరుల భద్రతపై చేతులెత్తేసిన ఇరాన్
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:53 AM
ఈ ప్రశ్నలకు ఇస్లామిక్ కౌన్సిల్ ఆఫ్ గ్రేటర్ టెహ్రాన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పర్వీజ్ సర్వారీ మంగళవారం చేసిన ఓ ప్రకటన అవుననే సమాధానం చెబుతోంది. ‘‘ఈ సంక్షోభ సమయంలో పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలి.

తమ పౌరుల భద్రతపై ఇరాన్ చేతులెత్తేసిందా?
ఎవరి భద్రత వారే చూసుకోవాలని స్పష్టం చేసిందా? ఈ ప్రశ్నలకు ఇస్లామిక్ కౌన్సిల్ ఆఫ్ గ్రేటర్ టెహ్రాన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ పర్వీజ్ సర్వారీ మంగళవారం చేసిన ఓ ప్రకటన అవుననే సమాధానం చెబుతోంది. ‘‘ఈ సంక్షోభ సమయంలో పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు సురక్షిత ప్రాంతాలను, కొత్త షెల్టర్లను నిర్మించడం సాధ్యం కాదు. అందుబాటులో ఉన్న వనరులను వాడుకోండి. సబ్‌వేలు, మెట్రో స్టేషన్లను ఆశ్రయించండి’’ అని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ బ్యాంకులపై సైబర్ దాడులు!
ఇరాన్‌లోని బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరుగుతున్నట్లు అరబ్ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. ఇరాన్ వార్తాసంస్థ ఫార్స్ న్యూస్ సైతం.. ద బ్యాంక్ ఆఫ్ సెపాపై పెద్ద ఎత్తున సైబర్ దాడి జరిగినట్లు పేర్కొంది. దీంతో.. ఇరాన్ వ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడింది. మొబైల్ బ్యాకింగ్, నెట్‌బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు స్తంభించాయి.
ఖమేనీ అధికారాలు కౌన్సిల్‌కు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తన పరిధిలోని అధికారాలను ఐఆర్‌జీసీ సుప్రీం కౌన్సిల్‌కు బదిలీ చేశారు. దీంతో.. ఇప్పుడు యుద్ధంపై కౌన్సిల్ పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ మేరకు ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ ఓ బ్రేకింగ్ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం సుప్రీంలీడర్ బంకర్‌లోనే ఉన్నారని వెల్లడించింది. ‘‘ఇకపై యుద్ధ నిర్వహణ కౌన్సిల్ అధీనంలో ఉంటుంది’’ అని వివరించింది.