Citizenship Law : ఆపరేషన్ చేయించుకుని అయినా సరే.. ఆలోగా కనేద్దాం!
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:33 AM
జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు నేపథ్యంలో.. ఆ దేశంలోని పలువురు భారతీయ గర్భిణులు మెటర్నిటీ క్లినిక్‌ల ముందు క్యూ కడుతున్నారు!
ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్న జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వు
ఆలోపే పిల్లల్ని కనేందుకు ఆస్పత్రులకు క్యూ కడుతున్న భారతీయ దంపతులు
సిజేరియన్ చేయించుకోవడానికి సిద్ధం
హైదరాబాద్, జనవరి 23: జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు నేపథ్యంలో.. ఆ దేశంలోని పలువురు భారతీయ గర్భిణులు మెటర్నిటీ క్లినిక్‌ల ముందు క్యూ కడుతున్నారు! డాక్టర్లు ఇచ్చిన డేట్ ప్రకారం మార్చిలో వారికి ప్రసవం జరగాల్సి ఉండగా.. ట్రంప్ ఉత్తర్వు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తుండడంతో, ఆలోగానే శస్త్రచికిత్స (సిజేరియన్) ద్వారా పిల్లలను కనడానికి సిద్ధమవుతున్నారు!! అలా చాలా మంది దంపతులు సి-సెక్షన్ కోసం తమను సంప్రదించారంటూ అమెరికాలోని భారతీయ గైనకాలజిస్టులను ఉటంకిస్తూ ఒక ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. జనవరి 20న ట్రంప్ అధికారం చేపట్టగానే సంతకాలు చేసిన తొలి ఎనిమిది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లలో ముఖ్యమైనది అమెరికా గడ్డపై పుట్టినవారికి ఆటోమేటిగ్గా ఆ దేశ పౌరసత్వాన్ని కల్పించే హక్కును రద్దు చేస్తూ జారీ చేసి ఉత్తర్వు. అయితే, ఆ ఉత్తర్వును జారీ చేసిన 30 రోజుల తర్వాత పుట్టేవారికి మాత్రమే జన్మతః పౌరసత్వ హక్కు ఉండదని అందులో పేర్కొన్నారు. దీంతో ఫిబ్రవరి 19 దాకా అమెరికాలో పుట్టే ప్రతి ఒక్కరికీ బర్త్ రైట్ సిటిజెన్‌షి్‌ప లభిస్తుందన్నమాట. దీంతో.. ఆ తర్వాత బిడ్డను కనే అవకాశం ఉన్న భారతీయ దంపతులు చాలా మంది అక్కడున్న ఇండియన్-అమెరికన్ వైద్యులను సిజేరియన్ కోసం సంప్రదిస్తున్నట్టు ఆంగ్ల వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. వారిలో చాలా మంది హెచ్-1బీ, ఎల్1 వీసాలపై అమెరికాకు వచ్చినవారు, గ్రీన్‌కార్డుల కోసం ఎన్నో ఏళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారని.. ఆయా దంపతుల్లో ఏ ఒక్కరికీ అమెరికన్ పౌరసత్వం లేకపోవడంతో ఫిబ్రవరి 19 తర్వాత ప్రసవం అయితే, ఆ పుట్టే పిల్లలకు సైతం అమెరికన్ పౌరసత్వం రాదనే ఆందోళనతో వారు వైద్యులను సంప్రదిస్తున్నట్టు వివరించింది.
తమ పిల్లలకు పౌరసత్వం వస్తే.. వారికి 21 ఏళ్లు వచ్చాక, అమెరికాలో వారితో కలిసి ఉండడానికి తమకు అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతోనే వారు ఇలా చేస్తున్నట్టు వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. గడిచిన 2-3 రోజులుగా సి-సెక్షన్ ఆపరేషన్ల కోసం పెద్దసంఖ్యలో భారతీయ దంపతులు తనను సంప్రదిస్తున్నారంటూ న్యూజెర్సీకి చెందిన గైనకాలజిస్టు డాక్టర్ ఎస్‌డీ రమ తెలిపారు. ఏడో నెల గర్భంతో ఉన్న ఒక మహిళ తన భర్తతో సహా వచ్చి.. నెలలు నిండకముందే ఆపరేషన్ ద్వారా బిడ్డను కనడానికి సిద్ధమైందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇలా పౌరసత్వం కోసం నెలలు నిండకముందే సిజేరియన్ చేస్తే.. పుట్టే పిల్లలకు ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదురవుతాయని, వారి ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందవని, తక్కువ బరువు, నాడీ సంబంధిత సమస్యల వంటివి తలెత్తుతాయని టెక్సా్‌సకు చెందిన మరో భారత సంతతి వైద్యురాలు హెచ్చరించారు. ఇప్పటిదాకా తనను అలా 20 జం టలు సంప్రదించాయని.. వారందరికీ ఈ సమస్యల గురించి చెప్పానని ఆమె తెలిపారు. కాగా, అక్రమ వలసదారుల నిర్బంధానికి సంబంధించిన కీలక బిల్లు కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. బుధ వారం 263-156 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించారు.