Russia conflict: రష్యాలో 16 మంది భారతీయుల మిస్సింగ్
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:04 AM
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడుతున్న భారతీయుల్లో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 16 మంది ఆచూకీ తెలియడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఇప్పటి వరకు యుద్ధంలో 12 మంది మృత్యువాత: కేంద్రం
న్యూఢిల్లీ, జనవరి 17: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడుతున్న భారతీయుల్లో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 16 మంది ఆచూకీ తెలియడం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఓ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రష్యా తరుఫున 126 మంది భారతీయులు యుద్ధంలో పాల్గొన్నారని చెప్పారు. వారిలో 96 మందిని రష్యా డిశ్చార్జి చేయడంతో కొందరిని స్వదేశానికి తీసుకువచ్చామని వెల్లడించారు. ఇంకా 18 మంది మాత్రం ఇప్పటికీ రష్యా ఆర్మీలో ఉన్నారని, వారిలో 16 మంది ఆచూకీ లేదని పేర్కొన్నారు. రష్యా వారిని కనిపించకుండా పోయినట్లు ప్రకటించిందన్నారు. మిగిలిన వారిని స్వదేశానికి పంపాలని రష్యాను భారత్ కోరిందని రణధీర్ జైశ్వాల్ చెప్పారు.