Share News

Imran Khan: ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలు పాకిస్థాన్‌ మాజీ ప్రధానికి శిక్ష

ABN , Publish Date - Jan 18 , 2025 | 05:30 AM

ఒక అవినీతి కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన సతీమణి బుష్రా బీబీలకు వరుసగా 14, ఏడేళ్ల జైలుశిక్షలు విధిస్తూ పాకిస్థాన్‌ కోర్టు ఒకటి శుక్రవారం తీర్పు ఇచ్చింది.

 Imran Khan: ఇమ్రాన్‌కు 14 ఏళ్ల జైలు పాకిస్థాన్‌ మాజీ ప్రధానికి శిక్ష

ఆయన సతీమణికి ఏడేళ్ల జైలు

అవినీతి కేసులో కోర్టు తీర్పు

ఇస్లామాబాద్‌, జనవరి 17: ఒక అవినీతి కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ఆయన సతీమణి బుష్రా బీబీలకు వరుసగా 14, ఏడేళ్ల జైలుశిక్షలు విధిస్తూ పాకిస్థాన్‌ కోర్టు ఒకటి శుక్రవారం తీర్పు ఇచ్చింది. 190 మిలియన్‌ పౌండ్ల అల్‌ ఖాదిర్‌ ట్రస్ట్‌ అవినీతి కేసులో ఈ ఇద్దరిని దోషులుగా నిర్ధారించి కోర్టు శిక్ష విధించింది. ఇమ్రాన్‌ఖాన్‌ను ఉంచిన అదీల జైలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక కోర్టులో జడ్జి ఈ తీర్పు ఇవ్వడం విశేషం. ఇమ్రాన్‌ఖాన్‌కు జైలు శిక్షతోపాటు పది లక్షల పాకిస్థాన్‌ రూపాయల జరిమానా, బుష్రా బీబీకి జైలుశిక్షతోపాటు 5 లక్షల పాకిస్థాన్‌ రూపాయల జరిమానా కూడా విధించడం గమనార్హం. అలాగే ఇమ్రాన్‌ఖాన్‌ దంపతులు ఏర్పాటు చేసిన అల్‌ ఖాదిర్‌ విశ్వవిద్యాలయం భూమిని కూడా జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా ఇమ్రాన్‌ఖాన్‌ ఇప్పటికే జైలులో ఉండగా... ఆయన సతీమణిని కోర్టు వద్దే తీర్పు అనంతరం అరెస్టు చేశారు. 2022లో పాక్‌ పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఓడిపోయున నాటి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ 12 కేసులను ఎదుర్కొంటున్నారు. తాను వాటి నుంచి ఎటువంటి ఉపశమనం కోరుకోవడం లేదని, ఆ కేసులను ఎదుర్కొంటానని.. ఒక నియంత దీనంతటికి కారణమని ఆయన అన్నట్లు సమాచారం.

Updated Date - Jan 18 , 2025 | 05:30 AM