Harvard University: హార్వర్డ్‌పై నిషేధం నిలిపివేత
ABN , Publish Date - May 24 , 2025 | 05:08 AM
హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. దీనిపై హార్వర్డ్ యూనివర్సిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన బోస్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి అల్లిసన్ బుర్రోగ్స్..
అమెరికా జిల్లా కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు
ఊపిరి పీల్చుకున్న 6703 మంది విదేశీ విద్యార్థులు
బోస్టన్, మే 23: హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. దీనిపై హార్వర్డ్ యూనివర్సిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన బోస్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి అల్లిసన్ బుర్రోగ్స్.. శుక్రవారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిషేధాజ్ఞలను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతకుముందు శుక్రవారం ఉదయం.. ‘ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టంగా దేశ రాజ్యాంగాన్ని, ఫెడరల్ చట్టాలను ఉల్లంఘిస్తోంది’ అని పేర్కొంటూ హార్వర్డ్ యూనివర్సిటీ పిటిషన్ దాఖలు చేసింది. విద్యారంగంలో తనదైన ముద్ర వేసేందుకు, అన్ని విద్యా సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు గురువారం హార్వర్డ్ వర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎ్‌స) నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దీని ప్రకారం స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్‌ఈవీపీ) సర్టిఫికేషన్ రద్దు చేయడంతో ఎఫ్-1 లేదా జే-1 వీసా కింద విదేశీ విద్యార్థులకు ఈ యూనివర్సిటీలో ప్రవేశార్హత ఉండదు. అయితే, తాము పెట్టిన 6 కఠిన షరతులకు కట్టుబడి ఉంటూ 72 గంటల్లో వివరణ ఇస్తే నిషేధం ఎత్తేస్తామని డీహెచ్‌ఎ్‌స షరతు విధించింది. ఒకవేళ, ట్రంప్ సర్కార్ నిర్ణయం అమల్లోకి వస్తే 2024-25 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన 788 మంది భారతీయులు సహా మొత్తం 6703 మంది విదేశీ విద్యార్థులు మరో ఎస్‌ఈవీపీ సర్టిఫైడ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం లేదా బహిష్కరణ వేటుకు ఎదుర్కోవాల్సి ఉండేది. గత ఐదేళ్లలో తమ సంస్థలో విద్యాభ్యాసం చేసిన విదేశీ విద్యార్థుల ప్రవర్తన, క్రమశిక్షణ, క్యాంపస్ ఆవరణలో నిరసనల ప్రదర్శనలు, హింసాత్మక కార్యకలాపాలపై వచ్చే 72 గంటల్లో హార్వర్డ్ యూనివర్సిటీ ఇచ్చిన నివేదికను బట్టి తన నిషేధాన్ని ఎత్తివేస్తామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ షరతు విధించిన సంగతి తెలిసిందే.